సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. గ్రామాలు, పట్టణాల్లో వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సంబురంగా సాగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలతోపాటు, 24 గంటల కరెంట్‌తో తుంగతుర్తి నియోజకవర్గం సిరుల మాగాణిగా మారిందన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విషప్రచారం చేస్తున్నారని, వాటిని పార్టీ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో దేశంలో దారిద్య్రం పెరిగిందని, ఆకలి చావులు ఎక్కుయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు.
– తిరుమలగిరి, మే 19
తిరుమలగిరి, మే 19 : నక్కతోడేళ్ల లాంటి బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలగిరిలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో రెండు పూటలా అన్నం తింటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దేశంలో అగ్రగామి అనే గుజరాత్లో సైతం ఇంటింటికీ నల్లాలతో తాగునీరు అందట్లేదని విమర్శించారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించి రూ.500నుంచి 5వేల బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలన్నారు.
సీఎం కేసీఆర్ మనకే గుర్తులేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వాటి గురించి ప్రజలందరికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తే అందరికీ 50వేల మెజార్టీ సాధించే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని అందుకే దేశ ప్రజలు ఆయన పాలన కోరుకుంటున్నారన్నారు. రాష్ర్టానికి చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు మొక్కలు నాటితే రాజశేఖర్ శిలాఫలకాలు వేశారని, సీఎం కేసీఆర్ మాత్రం నీళ్లు ఇచ్చారని తెలిపారు. పదేండ్లలోనే తెలంగాణ వందేండ్ల అభివృద్ధి సాధించిందన్నారు. దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
అభివృద్ధి గురించి చెబితే రోజులు చాలవు
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి వివరించాలంటే రోజులు సరిపోవని, ఏరాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. అందుకే తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి దేశ చరిత్రలో కేసీఆర్ నిలిచిపోయాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నన్ని చెరువులు, కుంటలు మరెక్కడ లేవన్నారు. పూర్వకాలం నుంచి ఇక్కడ పాడి పంటలు పండేవన్నారు. అందుకే బౌద్ధమతం ఇక్కడ వెలిసిందనిన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం వెకబాటుకు గురైందన్నారు.
సీఎం కేసీఆర్ వచ్చాక సాగు నీరు అందడంతో సిరుల మాగాణిగా మారిందన్నారు. గతంలో హత్యా రాజకీయాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. గత స్మృతులు ఇక్కడ ఉండరాదన్నారు. తుంగతుర్తి ప్రాంతం ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా సభావేదిక వద్దకొచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ స్రవంతి, ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కర్ణాకర్, వైస్ ఎంపీపీ సుజాత, మండల ప్రధాన కార్యదర్శి తెడ్డు భాస్కర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాకూబ్, రైతు బంధు సమితి జిల్లా సభ్యురాలు సరిత, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుంగతుర్తి సాగునీటితో సస్యశ్యామలం
ఎడారిగా ఉన్న తుంగతుర్తి ప్రాంతం ప్రస్తుతం సాగునీటితో సస్యశ్యామలం అయ్యిందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వందల కోట్ల నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చాకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. రూ.20కోట్లతో తిరుమలగిరి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తాగు, సాగు, విద్యుత్, రహదారులు అన్ని రంగాల్లోనూ దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను మూడో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తుంగతుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. రెండు సార్లు తన గెలుపునకు కృషిచేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి తుంగతుర్తి గడ్డపై తనను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. వెనుకబడిన తుంగుతుర్తి ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశానన్నారు. పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకెళ్లి సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని, మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.