నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం 11గంటలకు జిల్లా కేం ద్రమైన నల్లగొండకు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేటీఆర్ రాక కోసం నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఇప్పటికే అన్ని ఏర్పా ట్లు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ పర్యటన విజయవం తం చేసేందుకు పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. సరిగ్గా ఉద యం 11 గంటలకే కేటీఆర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారని, పార్టీ మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులకు సన్మానం చేస్తారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.
నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఇటీవల గెలుపొందిన పంచాయతీ పాలకవర్గ సభ్యులంతా ఉదయం 10 గంటలకే పార్టీ జిల్లా కార్యాలయానికి రావాలని సూచించారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పరిశీలించి తగిన సూచనలు చేశారు. కార్యక్రమానికి తరలివచ్చే వేలాది మంది పార్టీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం నల్లగొండ పట్టణమంతా గులాబీ సైనికులతో సందడిగా మారనుంది. ఇప్పటికే కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిలకు స్వాగతం పలుకుతూ పట్టణంలో భారీ ఎత్తున కటౌట్లు, ప్లెక్సీలు, గులాబీ తోరణాలు వెలిశాయి. కేటీఆర్ పర్యటన సాగే హైదరాబాద్-నార్కట్‌పల్లి మార్గంలో, నార్కట్‌పల్లి – నల్లగొండ మార్గంలో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో స్థానిక నేతలు భారీ స్వాగత ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.

11గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో..
పర్యటనలో భాగంగా కేటీఆర్ ఉదయం 11 గంటలకే నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. సరిగ్గా 11 గంటలకు పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని విజయాలు సాధించేలా పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకే కేటీఆర్ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కార్యక్రమంలో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులతో పాటు జిల్లాకు చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతోపాటు అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.