నీలగిరి, సెప్టెంబర్ 1: కాళేశ్వరంపై ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి క్లాక్‌టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. దీంతో పట్టణంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు వారిని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాలు ప్రదర్శిస్తోందని, కేసీఆర్‌పై ఎన్ని కుట్రలు పన్నినా జనం మద్దతుతో తిప్పికొడతామని హెచ్చరించారు.
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వారి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం పేరుతో కొత్త డ్రా మాలు ఆడుతోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నిన్నటిదాకా సీబీఐని విమర్శించిన రేవంత్ నేడు కాళేశ్వరం కేసును అదే సీబీఐతో విచారణ చేయించాలని అసెంబ్లీలో తీర్మానించడాన్ని చూస్తే ఈ వ్యవహారం వెనుక ఓ కుట్ర దాగి ఉందన్నారు. దీనిని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని ఎటువంటి విచారణకైనా తమ నాయకులు సిద్ధమన్నారు.
ప్రభుత్వం కేసీఆర్‌కు ఎటువంటి ద్రోహం తలపెట్టినా జనం తిరగబడతారన్నారు. కార్యక్రమంలో చీరా పంకజ్ యాదవ్, నిరంజన్ వలి, మాలే శరణ్య రెడ్డి, రేగట్టే మల్లికార్జున రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, వం గాల సహదేవరెడ్డి, కరీంపాషా, మారగొని గణేశ్రావుల శ్రీనివాసరెడ్డి కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, దేప వెంకట్ రెడ్డి, వనపర్తి జ్యోతి, , కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ బడుపుల శంకర్, వీరమల్ల భాసర్, బొమ్మరబోయిన నాగార్జున తదితరుల పాల్గొన్నారు.