నల్లగొండ, ఆగస్టు 17 : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు ఏడాది పాలన గడువక ముందే హింసకు తెరతీసిందని, మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి అందులో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఇది అల్లరిమూకలు చేసిన దాడి కాదని, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసే ఇలాంటి చిల్లర వేషాలకు బీఆర్ఎస్ భయపడదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వేసిన ఎత్తులను కూడా చిత్తు చేసి రాష్ట్రం సాధించిన కేసీఆర్, బీఆర్ఎస్ అన్నది గుర్తుంచుకోవాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడకుండా సంక్షేమ పాలన అందించిన విషయం ప్రజలకు తెలుసని, ఏడాది కాలంలోనే భౌతిక దాడులు మొదలుపెట్టిన కాంగ్రెస్ రాక్షసాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులకు గమనించారని, ఈ విషయంపై రైతులు ఎక్కడ రోడ్లు ఎక్కుతారో అని ముందస్తు కుట్రతోనే ఈ దాడులు జరిపి మీడియాను, ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో రాహుల్, రేవంత్ రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 50లక్షల మంది రైతులకు రూ.49వేల కోట్లు కావాలన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. తర్వాత రూ.39వేల కోట్లు.. మరోసారి రూ.36వేల కోట్లు అన్న మీరు రూ.31వేల కోట్లు మాఫీ చేస్తామని క్యాబినెట్లో తీర్మానించి బడ్జెట్లో రూ.26వేల కోట్లు కేటాయించి చివరకు చేసింది రూ.17వేల కోట్లేనని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయల్లోపే 36లక్షల మందికి రూ.17వేల కోట్లు మాఫీ చేస్తే కాంగ్రెస్ 22 లక్షల మందికి రూ.17వేల కోట్లే మాఫీ చేసి అందరికీ చేశామని చెప్పడం మోసం కాదా? అని నిలదీశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగనందున రైతులు ఎక్కడ గగ్గోలు పెడుతారోనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుపై అనవసరమైన ఆరోపణలు చేసి సీఎం ఇంకా దిగజారుతున్నారని పేర్కొన్నారు.
బీజేపీలో కలిసేది బీఆర్ఎస్ కాదని, ఆయనే త్వరలో బీజేపీలో చేరుతాడని ఆ పార్టీ మంత్రులే అనుకుంటున్నట్లు చెప్పారు. ఇంకా నాలుగేండ్ల పాలనలో ఎన్ని మోసాలు చేస్తాడో రైతులు గమనించాలన్నారు. రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు మిగిలిన డబ్బు చెల్లిస్తే రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పడం కొత్త మోసమన్న జగదీశ్‌రెడ్డి.. ముందు రెండు లక్షల వరకు బ్యాంకులకు పంపాలని, మిగిలిన మొత్తం రైతులే కట్టుకుంటారని డిమాండ్ చేశారు. ఆధార్‌లో తప్పులని, పేరులో తప్పులని, పాస్‌బుక్ తప్పుందని కాకమ్మ కథలు మానాలని హితవు పలికారు.
ఎక్కడ తప్పులున్నా బ్యాంకర్లు రుణమే ఇవ్వరనే విషయం గమనించాలన్నారు. ఓట్ల కోసం ఆనాడు సకల అబద్ధాలు ఆడి ఈ రోజు రుణం ఎగ్గొట్టాలనే ఆలోచనతో కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్‌ను రైతులు నిలదీయాలని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. 45 శాతం రుణాలు మాఫీ చేసి 55 శాతం ఎగ్గొట్టడం సరికాదని, వెంటనే అందరికీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రైతులకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ, తెలంగాణలో నల్లగొండ ఉంటే గత యాసంగిలో నాశనం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే గత యాసంగిలో 4లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులకు అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదని హచ్చరించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి..
పెండింగ్‌లో ఉన్న గత రైతు బంధు రూ.4,500 కోట్లు వెంటనే విడుదల చేసి ఈ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం ఆ పార్టీ ఆఫీసుల మాదిరిగానే జరిగిందని, మంత్రి చెప్పిండని అధికారులు కూలగొడితే కోర్టు చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాలుగేండ్ల తర్వాత మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలీ, చీర పంకజ్‌యాదవ్, కటికం సత్తయ్యగౌడ్, తండు సైదులు గౌడ్, బోనగిరి దేవేందర్, మాలె శరణ్యారెడ్డి, మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీంపాషా, మైనం శ్రీనివాస్, ఐతగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, లొడంగి గోవర్ధన్, దోటి శ్రీనివాస్, రావుల శ్రీనివాసరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.