మిర్యాలగూడ, మే 2 : ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, అభివృద్ధి చేయకుండా చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేయడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మించిన కేసీఆర్ కళాభారతిలో కేసీఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం భాస్కర్‌రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేసీఆర్ కళాభారతి ఎదుట, అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్‌కు, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పోటీపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, అంతేగాని గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఆనవాళ్లు తొలగించడం ప్రజాస్వామ్యంలో మంచి సంస్కృతి కాదని అన్నారు. అధికారంలో ఉన్నాం మారుస్తాం, తొలగిస్తామని అనుకుంటే మిర్యాలగూడ పేరును పిడుగురాళ్ల, దాచేపల్లి మార్చుకోండని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టారని, ఇప్పుడు తమరు ఖాళీ చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కళాభారతి రాష్ట్రంలో వరంగల్ తర్వాత అత్యంత సుందరంగా నిర్మించిన కళావేదిక అని తెలిపారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి రూ.10కోట్లు తీసుకొచ్చి కళాభారతి నిర్మించినట్లు చెప్పారు. కేసీఆర్ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి ఆయన దూరం కారని, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. గత ప్రజాప్రతినిధులు వారి నాయకుల పేర్లు అభివృద్ధి పనులకు పెట్టుకున్నారని, తన హయాంలో వాటిపై ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ప్రస్తుత పాలకులు ఇసుక, కంకర మాఫియా చేస్తున్నారని ఆరోపించారు.
రూ.2కోట్లతో షాదీఖానా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశానని, పట్టణంలోని తడకమళ్ల రోడ్డు తాళ్లగడ్డకాలనీ వరకు నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయించామని, కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. 2014 నుంచి 2023 వరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.2,971.14కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం దాటినా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రూ.16 కోట్లతో ఏరియా ఆసుపత్రిలో వంద పడకల భవన నిర్మాణానికి పనులు చేపట్టగా 70శాతం పూర్తయ్యాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా కళావేదికకు కేసీఆర్ కళావేదిక పేరు అమర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబునాయక్, నాయకులు యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు యాదవ్, ఇలియాస్, మోసిన్‌అలీ, మాజీద్, మగ్దూం పాషా, చిర్ర మల్లయ్యయాదవ్, ఎండీ షోయబ్ తదితరులు పాల్గొన్నారు.