సూర్యాపేట, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడాన్ని నిరసిస్తూ మహిళాలోకం భగ్గుమంది. బీఆర్ఎస్ పార్టీ ఆధర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. మహిళ అని చూడకుండా సీఎం, డిప్యూటీ సీఎం ఇష్టారాజ్యంగా మా ట్లాడటంపై మహిళలు, బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.
సీఎం డౌన్ డౌన్.. వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన అం టూ నినదించారు. పలుచోట్ల రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొన్నిచోట్ల అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం తెలిపారు.
కోదాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అర్వపల్లి, తుంగతుర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాలతోపాటు జిల్లాలోని పలు మండలాల్లో నిరసనలు కొనసాగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజీ దగ్గరున్న తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యానర్‌తో నిరసన తెలిపాయి. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, రాష్ట్ర నాయకురాలు మాలె శరణ్యారెడ్డి, కరీంపాషా, దేప వెంకట్‌రెడ్డి, బోనగిరి దేవేందర్ తదితరులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
మిర్యాలగూడలో మాజీ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా సాగర్‌రోడ్డు మీదకు తీసుకొచ్చి దహనం చేశారు. మంద బలంలో దురహంకారం ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డి మహిళాలోకానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని భాస్కర్‌రావు డిమాండ్ చేశారు. దేవరకొండలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట డిండి మాజీ ఎంపీపీ మాధవరం సునీత ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీగా వెళ్లి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
నకిరేకల్‌లో మాజీ జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ, రామన్నపేట మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి ఆధ్వర్యంలో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేశారు. భువనగిరిలోని ప్రిన్స్ కార్నర్ వద్ద జరిగిన ఆందోళనలోనూ దిష్టిబొమ్మ దహనం చేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, గుండాలలోనూ తోపులాట జరిగింది. దిష్టిబొమ్మలను, నిరసన ఫ్లెక్సీలను కాల్చకుండా లాక్కొని వెళ్లారు.
బీఆర్ఎస్ నేతలను ఈడ్చు కు పోయారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు తోపులాటలు జరిగాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా గులాబీ శ్రేణులు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నేత లు ఆందోళన చేపట్టారు. మహిళా లోకానికి సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఆలేరులో జరిగిన కార్యక్రమంలో మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి పట్టణంలో కంచర్ల రామకృష్ణారెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు.