నీలగిరి, డిసెంబర్ 5 : నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, వారికి కృతజ్ఞతలు చెప్పాలని మెడికల్ కళాశాల వద్దకు చేరుకోగానే పోలీసులు వచ్చారు.
క్షీరాభిషేకానికి అనుమతి లేదని వారిని నిలువరించారు. కళాశాల నిర్మాణం కేసీఆర్ కృషితోనే జరిగిందని అందుకు సహకరించాలని పోలీసులను బీఆర్ఎస్ నేతలు కోరారు. అనుమతులు లేవని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ నేతలు క్షీరాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వారిని అడ్డుకున్నారు. కేసీఆర్ చిత్రపటాన్ని బీఆర్ఎస్ నేతల నుంచి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య కొంత తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సుదూర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ నేతల అరెస్టులను నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో నాటి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో మెడికల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. రూ.1,300 కోట్ల కేటాయించి నల్లగొండ పట్టణాభివృద్ధికి కృషి చేశారని, నల్లగొండ మెడికల్ కళాశాలకు రూ.250 కోట్లు కేటాయించి రూ.125 కోట్లతో భవన నిర్మాణం చేపట్టారని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని నిర్ణయిస్తే బీఆర్ఎస్ నాయకులను ఆరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గొడవలు చేసేందుకు అక్కడికి వెళ్లలేదని, కేవలం కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పేందుకే వెళ్లారని తెలిపారు. రోడ్డు మీద క్షీరాభిషేకం చేస్తే అడ్డుకోవడం విచిత్రంగా ఉందన్నారు. చేతనైతే దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అరెస్టు అయిన వారిలో నల్లగొండ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగోని గణేశ్, మెరుగు గోపి, దండెంపల్లి సత్తయ్య, కంకణాల వెంకట్‌రెడ్డి, దొడ్డి రమేశ్, మాతంగి అమర్, వజ్జా శ్రీనివాస్, దేప రాంరెడ్డి, రఫీ, గణేశ్, పరమేశ్‌నాయక్, గోపగోని నర్సింహ, రవి, కోరె అంజయ్య, కందుల నరేందర్ తదితరులు ఉన్నారు.