ఏండ్ల తరబడి కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. అప్పటి సీఎం కేసీఆర్ మే 2023లో వీరందరినీ రెగ్యులర్ చేసి సర్కార్ ఉద్యోగులుగా ఆమోద ముద్రవేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో పనిచేస్తున్న 258 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ.. సంతోషం ఎంతో కాలం నిలువలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో దఫా రావాల్సిన ఇంక్రిమెంట్లు నిలిపివేశారు.
రామగిరి, జూన్ 3: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వీరిని పట్టించుకున్న నాయకులు, సర్కార్ లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వీరి వేతనాలు రూ. 18వేల నుంచి రూ. 27వేలకు పెంచారు. ఆ తర్వాత రూ.37, 100 పెంచారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి సీఎం కేసీఆర్ మే 3, 2023న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేశారు. వీరందరికీ గత సంవత్సరం(మే 2024)లో తొలి ఇంక్రిమెంట్ అందింది. అయితే రెండవ ఏడాది మే. 2025లో సహజంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ అడ్డుకుంటున్నదని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.
రెగ్యులర్ అధ్యాపకులకు ప్రతి సంవత్సరం సహజంగా ఇంక్రిమెంట్లు వేస్తూ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు వేతనం చేయాలి. కాని ఇంటర్మీడియట్ బోర్డు, డీఐఈవోల నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇంక్రిమెంట్లు మంజూరు చేయలేదు. బీఆర్ఎస్ సర్కార్ రెగ్యులర్ చేసిన అధ్యాపకులు ప్రొబేషనరీ పూర్తి చేసినప్పటికీ 2వ ఇంక్రిమెంట్లు చేయకుండా ఇబ్బందులు పెడుతూ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్ సప్ల్లిమెంటరీ పరీక్షల స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయని పక్షంలో న్యాయస్థ్ధానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.