యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గులాబీ కేడర్‌లో నూతనోత్తేజం వచ్చింది. ఓ వైపు పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల్లోనూ కాంగ్రెస్ కంచుకోటలను దెబ్బకొట్టి.. బీఆర్ఎస్ అభ్యర్థుల జనం ప్రభంజనం కొనసాగింది. మరో వైపు కేటీఆర్ ఆత్మీయ సన్మానంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పక్కా వ్యూహాలతో కాంగ్రెస్ కకావికలమైంది. త్వరలోనే బీఆర్ఎస్ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ శిబిరాలతో మరింత జోష్ నెలకొననుంది. ఇంకో వైపు కాంగ్రెస్ కంచుకోటలో దెబ్బతిన్న ఆ పార్టీ కేడర్ డీలా పడింది. రానున్న పరిషత్ ఎన్నికల్లో హస్తం పార్టీని కుదేలు చేయడంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో ముగిశాయి. ఈ నెల ప్రారంభం నుంచి పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. చలికాలంలోనూ గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలవడానికి ఆస్కారం ఉంటుంది. బీఆర్ఎస్ సర్కారులోనూ ఇదే నిరూపితమైంది. ప్రస్తుతం సీన్ రివర్సయ్యింది. అనేక చోట్ల కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైంది. మండలాలకు మండలాలే ఓటర్లు బీఆర్ఎస్కు జై కొట్టారు. భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏకంగా 57 సర్పంచ్ సీట్లను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ 55 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సొంత మండలంలోనే ఏకంగా 18 సర్పంచ్ పదవులను బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. బీబీనగర్‌లో 12, పోచంపల్లిలో 9 చొప్పున గెలుచుకుంది. ఆలేరు నియోజకవర్గంలో గులాబీ పార్టీ సత్తా చాటింది. మొత్తంగా 74 చోట్ల కారు పార్టీ గెలిచింది. మూడో విడతలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలంలో 20 సర్పంచ్ స్థానాలకుగాను 10 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. నాలుగు చోట్ల సింగిల్ డిజిట్ ఓట్లతోనే ఓడిపోవడం గమనార్హం. తొలి విడతలో 153 స్థానాల్లో పోటీ చేయగా 58 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. మునుగోడు నియోజకవరలో 15, తుంగతుర్తిలో 9, నకిరేకల్‌లో 10 మంది సర్పంచ్ స్థానాల్లో గెలిచారు. 40 శాతానికిపైగా ఓట్లు గులాబీ పార్టీకి పోలవడం విశేషం. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి.. ఆలేరులో గొంగిడి మహేందర్‌రెడ్డి తమ వ్యూహాలకు పదుపు పెట్టి కారు పార్టీ విజయానికి పునాదులు వేసి సక్సెస్ అయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడంతో రాష్ట్రస్థాయిలో చర్చ జరిగింది. దీంతో గెలిచిన అభ్యర్థులకు సన్మానాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నిర్ణయించి యాదాద్రి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ఈ నెల 18న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం విజయవంతమైంది. ఊహించిన దాని కంటే అధికంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో వచ్చినోళ్లంతా సభ చుట్టూ నిల్చుండిపోయారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను వేదికపైకి ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం కొనసాగింది. కేటీఆర్ ప్రసంగం పార్టీ కేడర్‌లో జోష్ నింపించింది. పంచ్‌లు, వ్యంగ్యస్ర్తాలు, వాక్పటిమతో ప్రసంగం ఆకట్టుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరిపై కేటీఆర్ పంచ్‌లు సభికులను ఉర్రూతలూగించాయి. ప్రతి ఒక్క సర్పంచ్, ఉపసర్పంచ్‌ను వేదికపై కేటీఆరే సన్మానించారు. 5 గంటల పాటు భువనగిరిలో గడిపి బీఆర్ఎస్ కేడర్‌కు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా కల్పించారు.
పంచాయతీ పోరులో బీఆర్ఎస్ తన సత్తా చాటడంతో రానున్న పరిషత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు. త్వరలో పార్టీ గుర్తులపై ఎన్నికలు రానున్నాయి. అప్పుడు మరింత బలంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు, మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. జిల్లాలోనూ ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
సర్పంచ్‌లుగా ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా.. రిజర్వేషన్‌ను బట్టి మళ్లీ వాళ్లకే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సదరు అభ్యర్థులపై సానుభూతి పనిచేసే అవకాశం ఉంటుంది. త్వరలో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. అంతే కాకుండా పార్టీ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. దీంతో బీఆర్ఎస్ మరింత బలంగా మారనుంది. ఇక నుంచి పార్టీ జిల్లా కార్యాలయం నిత్యం కళకళలాడనుంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు సలాం. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆగడాలకు వెన్నువిరవకుండా గులాబీ పార్టీని గెలిపించిన కేడర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఎవరికీ ఆపద రాకుండా అండగా ఉంటాం. కేటీఆర్ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహనికి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లోనూ అందరం కలికట్టుగా ముందుకెళ్దాం. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం.