రామగిరి, మార్చి 30 : హుజూర్నగర్ నియోజవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, మాజీ సర్పంచ్‌లపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రదర్శించింది. బీఆర్ఎస్ నాయకులతోపాటు సీపీఎం, ఎమ్మార్పీఎస్ తదితర ప్రజా సంఘాలపై కక్షపూరితంగా వ్యవహరించింది. ఆదివారం ఉదయం నుంచే నేతల ఇండ్ల వద్దకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కొండమల్లేపల్లి, గుర్రంపోడ్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హాలియా, చిట్యాల, దామరచర్లలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులను.. త్రిపురారంలో మాజీ సర్పంచ్‌లను.. తిరుమలగిరి సాగర్‌లో బీఆర్ఎస్వీ, దళిత సంఘాల నాయకులను.. కట్టంగూర్‌లో సీపీఎం, ఎమ్మార్పీఎస్ నాయకులను.. హుజూర్నగర్, మఠంపల్లి, పాలకవీడు, గరిడేపల్లి, అనంతగిరి, మద్దిరాల, అర్వపల్లిలో బీఆర్ఎస్, సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నదని నేతలు మండిపడ్డారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించడానికి పలువురు నేతలు మండిపడ్డారు. నిర్బంధాలు, అరెస్ట్‌లతో ప్రభుత్వం పాలన సాగించలేదని, హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి సారించాలని సూచించారు.