కోదాడ టౌన్, మే 16 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు కటికం సత్తయ్యగౌడ్ అన్నారు. కోదాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను చైతన్య పర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నదని, విద్యావంతుడు, యువకుడు రాకేశ్‌రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేయాలని అన్నారు. పట్టభద్రుల ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.