నల్లగొండ ప్రతినిధి, మే16(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు రైతులను దళారులు, మిల్లర్లు నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు సన్నద్ధమైంది. సోమవారం ఉదయం నల్లగొండ కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ పార్టీ పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగనున్న ఈ మహాధర్నాకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిత్యం రైతులకు అండగా నిలుస్తున్నారు. కొనుగోళ్లల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ తాలు, తరుగు, ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్న తీరుపైనా ఆందోళనలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల వారీగా నెలకొన్న సమస్యలపై పార్టీ నేతలు దృష్టి సారిస్తూ సెంటర్ల నిర్వాహకులు, అధికారులపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు నిత్యం ధాన్యం, మక్కలు, జొన్నల కొనుగోళ్లపై క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు.
ఇదే తీరులో జిల్లాలోనూ మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా రైతుల పక్షాన నిత్యం స్పందిస్తూ కొనుగోళ్లపై దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, రైతుల సమస్యలు తెలుసుకుంటూ వారికి అండగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైన చోట రైతులతో కలిసి రోడ్లెక్కి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో నల్లగొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ స్వయనా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా రోజుల తరబడి రైతులు కొనుగోళ్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కో కేంద్రంలో నెల రోజుల నుంచి కాంటా కోసం ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి తరుణంలో రైతుల పక్షాన పోరాటానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ నెల 18న రైతుమహాధర్నాకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జరిగే రైతు మహాధర్నాకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యంతో పాటు నిర్వాహకులు, మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తాలు పేరుతో నిర్వాహకులు 40.700 కేజీల బదులు ఏకంగా 42.500కేజీల వరకు తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇక మిల్లుల వద్దకు వెళ్లాక మరో రెండు నుంచి మూడు కేజీల వరకు తరుగు తీస్తున్నారన్నారు. ఇలా క్వింటాల్‌కు 10 కిలోల వరకు రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రైతులంతా ప్రభుత్వ నిర్లక్ష్యం, దోపిడీపై తిరగబడేందుకు సోమవారం జరిగే మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో సభ్యత్వ నమోదుపై సమావేశం ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ వెల్లడించారు. మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితో పాటు పార్టీ ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి రెండు జిల్లాకు చెందిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పారు. త్వరలో చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఒక్కో బూత్‌కు ఇద్దరిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం లాంటి అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.