ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 22 : తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పదేండ్ల పాలన వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు, ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాయని, ఆ అభిమానంతో ప్రజలు, రైతులు ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ సభకు ఎడ్లబండ్లపై సాహసోపేతమైన యాత్ర చేపట్టారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
ఎడ్లబండ్లపై పలువురు రైతులు వరంగల్ సభకు బయల్దేరగా ఆత్మకూర్.ఎస్ మండ లం నెమ్మికల్ దండు మైసమ్మ ఆల యం వద్ద మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. సుమారు 5 కిలోమీటర్లు ఎడ్ల బండిని నడిపిన జగదీశ్‌రెడ్డి అందరిలో ఉత్సాహాన్ని నిం పారు. యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరుగనున్న 25 ఏండ్ల బీఆర్ఎస్ పండుగకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారని తెలిపారు. సూర్యాపేట నుంచి రైతులు ఎడ్లబండ్లతో తరలివెళ్లడం ఆనందంగా ఉందన్నారు. బండెనక బండి కట్టి 16బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని చెప్పారు. రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని అ న్నారు.
నీడలో ఉన్న వాళ్లం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని చెప్పారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలాగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. అటువంటి దేవుడు లాంటి కేసీఆర్‌ని వదులుకున్నామన్న బాధలో ప్రజలంతా ఉన్నారని, అం దుకే కేసీఆర్ మీద అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయల్దేరారని చెప్పారు.
ప్రజలంతా హాజరై ఈ సభను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేక సభలాగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారని అన్నారు. గత పది రోజుల క్రితం రైతులు కలిసి ఎడ్ల బండ్లపై వెళ్దామంటే, 130 కిలో మీటర్ల మేర ఈ ఎండలో వెళ్లడం సాధ్యమైద్దా అన్నానని, ‘కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్నోళ్లం.. ఈ ఎండలను తట్టుకోవడం లెక్క కాదు’ అని రైతులు ధీమాగా చెప్పారని గుర్తు చేశారు.
సభ సమయానికి చేరుకునేలా ముందుగా అనుకున్న ప్రకారం ఐదు రోజుల ముందుగా బయల్దేరారని తెలిపారు. కేసీఆర్‌పైన రైతాంగం చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతుందని తెలిపారు.