మాడ్గులపల్లి, మే 2 : మండలంలోని కల్వలపాలెం సమీపంలో పాలేరు వాగు ఉప్పొంగినప్పుడుల్లా గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉండేది. దాంతో వాగుపై తాత్కాలికంగా గూనలు వేసి రహదారిని నిర్మించుకునేవారు. నాలుగేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా గ్రామానికి రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ స్తులు మండలానికి వెళ్లాలంటే భీమనపల్లి, చర్లగూడెం, బొమ్మకల్ గ్రామాల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతోపాటు గ్రామస్తులు, విద్యార్థులు మిర్యాలగూడకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దాంతో గత్యంతరం లేక సుమారు 3 కిలోమీటర్ల మేర నడిచి ఎరుకలగుట్ట మీదుగా మిర్యాలగూడకు భీమారం బస్సు ద్వారా వెళ్లేవారు. అలాగే పాములపహాడ్, భీమనపల్లి, చర్లగూడెం రైతులు తమ ధాన్యాన్ని మిర్యాలగూడకు తరలించాలంటే కల్వలపాలెం పాలేరు వాగు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. కానీ వరద వచ్చినప్పుడల్లా వారి పరిస్థితి నరకప్రాయంగా ఉండేది. ఉమ్మడి పాలనలో ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుండడంతో సమస్యకు చెక్ పడింది.
ఎమ్మెల్యే భాస్కర్‌రావు సహకారంతో..
కల్వలపాలెం గ్రామస్తులకు పాలేరు వాగు అడ్డంకిగా మారడంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దాంతో ప్రభుత్వం రూ.3.30 కోట్ల నిధులు కేటాయించడంతో బ్రిడ్జి నిర్మాణ పనులను గత ఏడాది జనవరిలో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభించారు. పనులు చివరి దశకు చేరడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చర్లగూడెం, భీమనపల్లి, పాములపహాడ్, మంగాపురం, బొమ్మకల్ గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు లేక గతంలో ఇబ్బందులు పడ్డాం
కల్వలపాలెం గ్రామానికి పాలేరు వాగులో రోడ్డు లేక ఇబ్బందులు పడ్డాం. తాత్కాలికంగా ఉన్న రోడ్డు వర్షాలు వచ్చినప్పుడల్లా కొట్టుకుపోవడంతో మిర్యాలగూడ, మండల కేంద్రానికి వెళ్లాలంటే బొమ్మకల్, భీమనపల్లి, ఎరుకలగుట్ట మీదుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
–చిట్యాల యాకూబ్, కల్వలపాలెం
మే చివరికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి
బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మే నెల చివరిలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా పనులు కొనసాగిస్తున్నాం. బ్రిడ్జి నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి.
–దినేశ్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఏఈ