అర్వపల్లి, ఏప్రిల్ 10 : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ. ప్రభుత్వాలు మారుతున్నా నెరవేరని ప్రజల ఆకాంక్ష. మాటలకే పరిమితమైన రాజకీయ నాయకుల వాగ్దానాలు. కలగానే మిగిలిపోతున్న ఆ ఊరి జనం ఆశ. చిన్న చిన్న తండాలు బీటీ కి నోచుకోగా ఈ హైటెక్ యుగంలో కూడా ఇప్పటికి బీటీ రోడ్డుకు నోచుకోని గ్రామం. ఇది ఆ ఊరి జనం దౌర్భాగ్యమా?. వివరాళ్లోకి వెళితే అర్వపల్లి మండల కేంద్రానికి చేరువలో ఉన్న బొల్లంపల్లి గ్రామం సుమారు 750 ఓటరు జనాభా కలిగిన ఈ ఊరు గ్రామ పంచాయతీగానూ మారింది. నకిరేకల్- తానంచర్ల ఎన్హెచ్ 365 జాతీయ రహదారి నుండి ఊరిలోకి 2 కిలోమీటర్ల రోడ్డు కంకర తేలి గుంటలమయంగా మారింది.
ఎండాకాలం దుమ్ము, వానాకాలం రోడ్డు మొత్తం బురదతో నిoడి పాదాచారులు కూడా నడవలేని దుస్థితి. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వచ్చి తమను గెలిపిస్తే మీ ఊరుకు రోడ్డు వేస్తాం అనడం తప్పా ఆచరణ కనిపించడం లేదు. దీంతో ఆ ఊరి జనం రాజకీయ నాయకులకు తమ ఓట్లు అవసరం తప్పా, రోడ్డు అవసరం లేదనే బలమైన ఆలోచన మనసులో ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బొల్లంపల్లికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మా ఊరి రోడ్డు నా చిన్నప్పటి నుండి చూస్తున్న ఇప్పటివరకు పట్టించుకునే నాథుడే లేడు. ఊళ్లోకి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఆ రోజు మాత్రమే రోడ్డు గురించి మాట్లాడుతారు తప్ప మళ్లీ మాట్లాడారు. ఎమ్మెల్యే మందుల సామేల్ కూడా తనను గెలిపిస్తే మా ఊరికి రోడ్డు వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు. గెలిచి రెండున్నర సంవత్సరాలలు అయింది కానీ ఆ ఊసే ఎత్తడం లేదు. అసలు మా ఊరికి రోడ్డు వస్తదో రాదో తెలియడం లేదు.

కలగానే బొల్లంపల్లి బిటి రోడ్డు