మోతె, జనవరి 31: కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ మోతె మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతాంగానికి కాళేశ్వరం జలాలు ఇచ్చేది లేదు కానీ లిఫ్ట్‌ల పేరుతో కమీషన్ల కోసం కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ నుంచి వెళ్లిన వారితో నష్టమేమీ లేదని, వారు కూడా తమ తప్పును గుర్తించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ మారాలని కాంగ్రెస్ చేస్తున్న బలవంతపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటివరకు రైతుభరోసా ఇవ్వలేదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకో రైతు చొప్పున 412 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో 55 మందికి పైగా విద్యార్థులు మృతిచెందారని, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు, మండల నాయకులు మద్ది మధుసూదన్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, కొండ వెంకన్న, పల్స మల్సూర్, యూత్ అధ్యక్షుడు జానీపాషా, మహిళా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు నూకల శ్రీనివాస్‌రెడ్డి, దేవల నాయక్, మైనంపాటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.