సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): నగరంలో ఆలయాల వద్ద తరచూ ఏదో ఒక అలజడి జరుగుతున్నది. ఇలాంటివి వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటివి యాదృచ్ఛికంగానా ? ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయా? అనే సందేహాలను నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. అలజడి సృష్టించే వారిలో ఎక్కువగా ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఉండడం.. పోలీసుల విచారణలో బాధ్యులు మతి స్థిమితం సరిగ్గా లేనివారుగా తేలుతున్నది. అయితే మతిస్థిమితం సరిగ్గా లేని వారు ఆలయాల వద్దకు ఎందుకెళ్తున్నారు..? వారి మానసిక పరిస్థితిని మరింత లోతుగా పోలీసులు విశ్లేషిస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశంఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సికింద్రాబాద్‌లోని అమ్మవారి ఆలయం వద్ద ఏడాది కిందట జరిగిన ఘటన నుంచి బుధవారం రాత్రి మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగిన ఉదం తం వరకు చాలా కేసుల్లో బాధ్యులు మతిస్థితిమితం సరిగ్గా లేని వారిగా నే తేలుతున్నారు. కొందరేమో దొంగతనాలు చేసేందుకు ఆలయాల్లో చొరబడుతున్నారు. రెండు నెలల కిందట జవహర్‌నగర్‌లో అమ్మవారి ఆలయంలోకి ఓ వ్యక్తి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధ్యుడు యూపీ వాసిగా పోలీసులు గుర్తించారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తేల్చా రు.
చోటుచేసుకున్న ఘటనల్లో 80 శాతం మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం వల్లే అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. పట్టుబడుతున్న వారిలో జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన స్థానికేతరులైన బిహార్, యూపీ తదితర రాష్ర్టాలకు చెందినవారు ఉంటున్నారు. ఇదిలాఉండగా చాంద్రాయణగుట్టలోని ఓ ఆలయం వద్ద ఇటీవల అలజడి నెలకొంది. పోలీసుల విచారణ లో ఆలయంలోకి దొంగలు చొరబడ్డారనే విషయం తేలింది. పట్టుబడ్డ వారి లో రోహింగ్యాలు కూడా ఉండడంతో ఆందోళన నెలకొంది. మూడు కమిషనరేట్ల పరిధిలో పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.