కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 26 : కూకట్పల్లి నియోజకవర్గంలోని సున్నం చెరువులో ఫెన్సింగ్ వేయకుండా వదిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. గురువారం క్యాంప్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లాపూర్‌లోని సున్నం చెరువు పరిధిని జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, రూ. 47 లక్షలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, నేడు గత ఫెన్సింగ్ హద్దులను తొలగించి.. సర్వే నంబర్ 29,30లలో ప్రభుత్వ భూమి 5 ఎకరాల స్థలాన్ని వదలి కొత్త ఫెన్సింగ్ వేశారన్నారు.
ఈ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాలను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పదేండ్లలో ప్రభుత్వ భూములను రక్షించి ప్రజలకు అప్పగించామన్నారు. బేగంపేటలో 10 ఎకరాల భూమిని కాపాడమని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో పోరాడి 4 ఎకరాల స్థలాన్ని రక్షించి శ్మశానవాటికను నిర్మించామన్నారు. ఫతేనగర్ ప్రభాకర్‌రెడ్డి నగర్లో 1.13 ఎకరాలు, బాలానగర్‌లో 47 ఎకరాల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడమన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్‌పేట సర్వేనంబర్ 1లో ప్రభుత్వ భూమిని కాపాడి స్మశానవాటికలు, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, కులసంఘాలకు ఇచ్చామన్నారు.
బోయిన్పల్లి చెరువులో ఆక్రమణలు అడ్డుకుని ఫెన్సింగ్ వేసి సుందరీకరించామన్నారు. దిల్‌కుష్‌నగర్‌లో ఐడీపీఎల్ ఓవర్ ల్యాపింగ్లో రోడ్డు సమస్యను పరిష్కరించామని, బాలానగర్‌లో 2 ఎకరాల స్థలాన్ని కాపాడి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టామని, ప్రశాంత్‌నగర్‌లో స్థలాన్ని కాపాడి వైద్యశాలను నిర్మించామని, రాజీవ్‌గాంధీనగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ సొంత నిధులు (రూ.1.50 కోట్లు)లతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించామని, కూకట్‌పల్లిలో 16 ఎకరాల భూదాన్ భూములను కాపాడామని, కైత్లాపూర్ రెయిన్బో విస్తాస్ వెనుకాల 14 ఎకరాల ప్రభుత్వ భూమిపై పోరాడి.. ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు కేటాయించినట్లు తెలిపారు. అల్లాపూర్‌లో సర్వే నంబర్ 18లో 4 ఎకరాల స్థలాన్ని కాపాడి పాఠశాలకు దక్కెలా చేశామన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో 5 ఎకరాల స్థలాన్ని కాపాడి పార్కుగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
కాలనీ ఫేస్ 1.2లలో ఐదెకరాల హౌసింగ్ బోర్డుతో పోరాడి పార్కుగా చేశామని, ఐడీఎల్ చెర నుంచి 480 ఉదాసీన్ మఠం స్థలాన్ని కాపాడమని, కేపీహెచ్‌బీ కాలనీలో 3 ఎకరాల స్థలంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కాలనీ 9వ ఫేస్‌లో 2.5 ఎకరాల విలువైన స్థలాన్ని కాపాడి పార్కుగా అభివృద్ధి చేశామన్నారు. నెక్సెస్ మాల్ పక్కన 24 ఎకరాల హౌసింగ్ బోర్డు కాపాడమని, హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలలో మహిళలు, చిన్నారుల కోసం పార్కులను నిర్మించినట్లు తెలిపారు. డైమండ్ హిల్స్‌లో 2500 గజాల స్థలాన్ని కాపాడి పార్కుగా అభివృద్ధి చేశామన్నారు.
కైత్లాపూర్‌లో ప్రభుత్వ భూమిని రక్షించి డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించామని, కూకట్పల్లి కోర్టు భూమి 5 ఎకరాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతరులకు కట్టబెడితే.. దాని విముక్తి కోసం కృషి చేసినట్లు తెలిపారు. నేడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ భూములను రక్షించి ప్రజా అవసరాల కోసం కేటాయించినట్లు తెలిపారు. వీటన్నింటి విలువ ఎన్ని వందల కోట్లు ఉంటుందని ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. 40 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్నామని, తన సేవలకు మెచ్చి ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.ప్రజల కోసం ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని చెప్పారు.