– కర్ల రాజేష్ హత్యకు బాధ్యులైన అధికారులను తొలగించాల్సిందే
– హత్యపై ఆధారాలతో నిరూపించిన మందకృష్ణ మాదిగ
– అయినా చర్యలకు ప్రభుత్వం వెనుకడుగు
– జవాబు చెప్పకుండా హుజూర్నగర్లో అడుగు పెడితే అడ్డుకుంటాం
కోదాడ, మార్చి 12 : కోదాడ పట్టణానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్ ను చిత్రహింసలకు గురిచేసి చంపిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయలేదని, దీనికి జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో అడుగు పెడితే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో అడ్డుకుంటామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. హుజూర్నగర్ పర్యటనలో పాల్గొనే ముందు తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. కర్ల రాజేష్ హత్య జరిగి నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ ఆ రక్తపు మరకలు ఇంకా ఆరని పరిస్థితిలో తల్లి లలితమ్మకు గర్భశోకం మిగిల్చిన చిలుకూరు ఎస్ఐని ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధ్యులైన పోలీసు అధికారులను సర్వీస్ నుండి తొలగించి హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపేందుకు మీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందన్నారు.
తనపై వ్యక్తిగత కక్షతో దళిత బిడ్డను హత్య చేశారని, దాని వెనుక మంత్రి ఉత్తమ్ దంపతుల ప్రమేయం ఉందని సాక్షాత్తు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధారాలతో సహా నిరూపించినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. మంత్రులను కాపాడుకోవడం కోసం దళిత బిడ్డ ప్రాణాలను ఫణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాజేష్ కుటుంబాన్ని మంత్రి కనీసం పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూర్నగర్ గడ్డపై ఎలా అడుగు పెడతారని ముఖ్యమంత్రిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఎందుకు వెనకాడుతున్నారని, తాను బహిరంగ లేఖతో వెలువరించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, హత్యలో బాధ్యులైన పోలీస్ అధికారులను జైలుకు పంపకుండా హుజూర్నగర్కు రావాలని ప్రయత్నిస్తే ప్రజల పక్షాన మీ పర్యటన అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే బొల్లం స్పష్టం చేశారు. పోలీసుల లాఠీలు, తూటాలకు, కేసులకు ఇక్కడ భయపడే వారెవరు లేరని, రాజేష్ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఈ 14న ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ముందుకు కదలనీయమని ఆయన హెచ్చరించారు.