నల్లగొండ, జూలై 9: ఎల్‌నినో…అన్నదాతలకు శాపంగా మారిన ఈ గాలి పొర కారణంగా ప్రస్తుత వానకాలం సీజన్ సాగుపై నీలినీడలు కుమ్ముకోనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఏర్పడిన ఈ పొర గత నెలలో బలబడి ఇప్పటికే విస్తరించి నైరుతి రుతు పవనాలను బలహీన పరిచాయి. దీంతో గడిచిన రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో సాధారణ వర్షాలను మినహాయిస్తే మిగిలిన మండలాల్లో చిరు జల్లులే పడ్డాయి. జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 11.80లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.09 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌కు తోడు ఇప్పటికే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేకపోవటంతో పాటు భూగర్భ జలాలు కూడా మైనస్‌లు ఉండటంతో ఈ సారి సాగు పరిస్థితి ఎండమావులయ్యే అవకాశం లేకపోలేదు. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఈ ఎల్‌నినో వల్ల ఈస్టర్న్ దేశాల్లో ఒకటైన ఇండియాలోనూ పంటలపై ప్రభావం పడి కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోలేదు.
రెండు నెలల్లో ఐదు లక్షల ఎకరాల్లోనే సాగు..
జిల్లాలో ఇప్పటి వరకు సమృద్ధిగా వర్షాలు పడకపోవటంతో రైతులు వర్షాలు కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఇప్పటి వరకు 5.09 లక్షల ఎకరాలు మాత్రమే సాగుకు నోచుకుంది. అందులోనూ ప్రధానంగా పత్తి 5.96లక్షల ఎకరాలకు గాను 4.99లక్షల ఎకరాల్లో సాగు కాగా వరి మాత్రం 5.40 లక్షలకు గాను 9287 ఎకరాల్లోనే సాగైంది. ఇవి కాకుండా కందులు 1145 ఎకరాల్లో సాగైతే పెసర, ఇతర పంటలు మాత్రం మరో 70 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు మాత్రం పెద్ద వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
జల్లులతో పత్తి సాగు చేసినప్పటికీ పెద్ద వర్షాలు పడితేనే వరి సాగయ్యే అవకాశం ఉంది. గడిచిన రెండు నెలల్లో 104 సెంటీ మీటర్ల వర్షానికి గాను 131 సెంటీ మీటర్ల వాన పడటంతో 26 శాతం అదనపు వర్షం పడినట్లు రికార్డులు నమోదయ్యాయి. అయితే అది కూడా నాలుగైదు మండలాల్లో మాత్రమే పడగా మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. అది కూడా జల్లులు మినహాయిస్తే ఎక్కడా పెద్దగా వర్షాలు పడ్డ దాఖలాలు లేవు. దీంతో ఈ సీజన్లో రైతులు సాగు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏడాది చివరి వరకూ ఎల్‌నినో అవకాశం
సాధారణంగా ఎల్‌నినో అనే గాలి పొర రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైన ఎల్‌నినో సంవత్సరం చివరి వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ తెలియచేస్తున్నది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ గాలి పొర ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీన పడటంతో వర్షాల జాడేలేదు. దీని వల్ల వేడి గాలులు పెరిగి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. పైగా దీని ప్రభావం అల్పపీడనాలపై ఉండే అవకాశం ఉన్నందున ఈ వానకాలం సీజన్లో సాగుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో నీటి నిల్వలు లేకపోవటం వల్ల ఎడమకాల్వతో పాటు ఏఎమ్మార్పీ కింద సాగు పరిస్థితి అనుమానంగానే ఉంది.
బోర్లల్లో నీళ్లు లేవు..
పదెకరాల్లో వరి సాగు చేద్దామ ని విత్తనాలు తెచ్చి నారు పో సిన.. నారు పెరుగుతోంది కానీ వర్షం పెద్దగా పడకపోవటంతో మడుల్లో నీరు సరిపోక దున్నలేకపోతున్న. ఇప్పటి దాక పెద్దగా వర్షాలు పడకపోవటంతో బోర్లల్లో నీల్లు కూడా వస్తలేవు. అంతేకాకుండా సాగర్‌లో నీల్లు లేనందున ఏఎమ్మార్పీ కింద ఉన్న కాల్వల్లో పారుగంత కూడా లేదు. ఈ సారి సాగవుద్దా కాదా అనేది అంతుబట్టడం లేదు.
-నకిరేకంటి అశోక్, రైతు, ఎస్టీ కాలనీ, నల్లగొండ