మోతె, జూలై 03 : ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలది కీలక పాత్ర అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం మోతే మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది వివరాలను, హాజరు పట్టికను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై జరుగుతున్న పర్యవేక్షణ తీరును, రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను తాసీల్థార్ వెంకన్నను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో జరుగుతున్న బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గత ఎన్నికల్లో గ్రామ స్థాయిలో బీఎల్ఓలు కష్టపడి పని చేశారని కాబట్టే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగినట్లు తెలిపారు. బీఎల్ఓలు ముఖ్యంగా ఓటరు జాబితాలో సవరణలకు వచ్చే ఆరు, ఏడు, ఎనిమిది ఫారాలను జాగ్రత్తగా నింపాలని సూచించారు. ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులను జాగ్రత్తగా చేయాలన్నారు. అలాగే చనిపోయిన వారి ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడానికి బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించి తొలగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Mothe : ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలది కీలక పాత్ర : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్