యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) ; నెలనెలా రావాల్సిన డైట్ బిల్లులను చెల్లించడం లేదు. జిల్లాలో ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. ఒక్కో శాఖలో రూ.50లక్షల నిధులు పేరుకుపోయాయి. ఫలితంగా వసతి గృహాల నిర్వహణ భారంగా మారింది. వార్డెన్లు అప్పులు చేసి వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. దాంతో విద్యార్థులకు సక్రమంగా మెనూ, నాణ్యమైన భోజనం అందడం లేదు. మరోవైపు ఎస్సీ హాస్టళ్లలో ఇప్పటివరకు విద్యార్థులకు డ్రెస్‌లు పంపిణీ చేయకపోవడం విచారకరం.
పెండింగ్ బిల్లులు ఇలా..
జిల్లాలో ప్రీమెట్రిక్ ఎస్సీ హాస్టళ్లు 19 నడుస్తున్నాయి. అందులో బాలురవి 11, బాలిక వసతి గృహాలు 8 ఉన్నాయి. వాటిల్లో సుమారు 1,500 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ ఏడాది జూన్ వరకు బిల్లులు మంజూరు కాగా.. అప్పటి నుంచి నిధులు బంద్ అయ్యాయి. ఒక్క నెలకు 15 లక్షల రూపాయల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ పరిధిలో 50 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. బీసీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో 15 హాస్టళ్లు ఉండగా, సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి ఫిబ్రవరి వరకు మాత్రమే బిల్లులు వచ్చాయి. సుమారు 8 నెలలుగా నిధులు లేవు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 8 ఎస్టీ హాస్టళ్లు ఉండగా, సుమారు 700 మంది విద్యార్థులు ఉన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోనూ మార్చి నుంచి బిల్లులు రావడం లేదు. దాదాపు 40 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.
మెనూ అమలు అంతంతే..
ప్రభుత్వం 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.950, 8వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్లకు రూ.1,100 చెల్లిస్తున్నది. బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. బిల్లులు రాలేదని వార్డెన్లు ఉన్నదాంట్లోనే సరిపెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రోజూ ఉదయం రాత్రి భోజనంతోపాటు వారానికి ఒకసారి చికెన్, మూడు రోజులు కోడిగుడ్లు, అరటి పండ్లు ఇవ్వాలి. కానీ నిత్యావసర ధరలు పెరగడంతోపాటు బిల్లులు రాక మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారానికి రెండు గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. ఇడ్లీకి బదులు ఉప్మాతో సరిపెడుతున్నారు. ఇలా నాణ్యమైన భోజనం దొరక్కపోతే విద్యార్థుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
డ్రెస్‌లు, బ్యాగ్‌లు ఇంకెప్పుడిస్తరు?
హాస్టల్ విద్యార్థులకు ఏటా నాలుగు జతల యూనిఫామ్, కార్పెట్లు, బెడ్ షీట్లు, ఉలెన్ బ్లాంకెట్లు, స్కూల్ బ్యాగ్, మ్యాట్రెస్, దిండ్లు, నోట్‌బుక్స్ ఇస్తారు. వాస్తవానికి ఇవి హాస్టల్ ప్రారంభంలోనే ఇస్తారు. కానీ ఇప్పటి వరకు జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో డ్రెస్సులు, బ్యాగులు ఇవ్వలేదు. కార్పెట్లు, బెడ్ షీట్లు మాత్రం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మెస్ బిల్లులతోపాటు డ్రెస్‌లు అందించాలని చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
అప్పులు చేసి హాస్టళ్ల నిర్వహణ
ప్రభుత్వం సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, చికెన్, గ్యాస్, గుడ్లు, అరటి పండ్లు, పాలు తదితర వస్తువుల కొనుగోలుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వసతి గృహాల నిర్వహణ కోసం కొందరు వార్డెన్లు జీతం నుంచి సొంతంగా ఖర్చు చేస్తున్నారు. మరికొందరు ఉద్దెరకు తెస్తూ వండి పెడుతుండగా, ఇంకొందరు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దాంతో లక్షల రూపాయల్లో బిల్లులు పేరుకుపోతున్నాయి. కిరాణ దుకాణ యజమానులు కూడా తమకు ఉద్దెర ఇవ్వడం లేదని వార్డెన్లు వాపోతున్నారు.
డైట్ బిల్లులు వెంటనే చెల్లించాలి..
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డైట్ బిల్లులు పెండింగ్ పెట్టడం సబబు కాదు. నెలల తరబడి నిధులు ఇవ్వకుంటే హాస్టళ్ల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? ఎప్పటికప్పుడు బిల్లులు రాకపోవడంతో వల్ల వార్డెన్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ప్రభుత్వం వెంటనే హాస్టల్ డైట్ బిల్లులను చెల్లించాలి. డ్రెస్‌లు, బ్యాగులు అందించాలి.
– శాంతి కుమార్, ఏఐఎస్ఎఫ్, జిల్లా అధ్యక్షుడు