సాదాబైనామాల క్రమబద్ధీరణ కొందరికి మోదం. మరికొందరికి ఖేదం కానుంది. క్రమబద్ధీకరణలో గందరగోళం నెలకొంది. మూడేండ్ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం లేదు. దీంతో అనేక మంది పలు విధాలుగా నష్టపోనున్నారు. కొత్త వారికి సైతం రెగ్యులరైజేషన్కు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
40, 50 ఏళ్ల క్రితం భూములు, ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన సందర్భంలో తెల్లకాగితాలు, స్టాంపు పేపర్లపై రాసుకునే వారు. ఆ కాగితం ఉంటే అది కొనుగోలు చేసి వారి ఆస్తిగానే పరిగణనలోకి వచ్చేది. దాని ఆధారంగానే వారికి పట్టా కూడా చేసేవారు. చాలా మంది ఇలా తెల్ల కాగితాలు, స్టాంపు పేపర్లపై భూములు కొనుగోలు చేశారు. కానీ అప్పట్లో పాస్ బుక్లు పొందలేదు. అలా కొన్న వారిలో కొందరు చనిపోవడంతో.. ఆ సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి రెండు విడుతలుగా దరఖాస్తులు స్వీకరించి కొన్నింటిని పరిష్కరించింది.
కొత్త చట్టంలోని సెక్షన్, రూల్ 6 ప్రకారం సాదాబైనామాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా -2014 జూన్ కంటే ముందు సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసి 12 ఏండ్లు స్వాధీనంలో ఉండడంతోపాటు గత ప్రభుత్వం నిర్దేశించిన గడువులో చేసుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ జరుపుతారు. పీఓటీ, సీలింగ్ ఆయా చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకున్న తర్వాత అర్హత ఉన్న రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డుల్లో నమోదు చేసి పాసు పుస్తకం జారీ చేస్తారు. కాగా సాదా బైనామాలు క్రమబద్ధీకరణ కాకపోవడంతో రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. రిజిస్ట్రేషన్లు కాక భూములపై హక్కులు పొందడం లేదు. పట్టా పాస్ పుస్తకాలు లేవు. ఇప్పటికీ సదరు భూములు పాత యజమానుల పేర్లే కనిపిస్తున్నాయి. రైతు భరోసా, రైతు బీమాకు అనర్హులుగా ఉంటున్నారు. బ్యాంకు రుణాలు రావడం లేదు. ధాన్యం విక్రయిస్తే వచ్చే నగదు జమ కాదు. జూన్ 2 నుంచి కొత్త చట్టం పూర్తి స్థాయిలో అమలు కానుండడంతో కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా భూ భారతి ఆర్వోఆర్ చట్టం-2024 తీసుకొచ్చింది. దాంతో సాదాబైనామా సమస్య పరిష్కారం కానుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నెలలు గడుస్తున్నా ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఎదురుచూపు తప్పడం లేదు. అయితే ఇదివరకే దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా దరఖాస్తుదారులను పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడేండ్ల కిందట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారుగా లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించగా కొన్నింటిని తిరస్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,500 దరఖాస్తులు, నల్లగొండలో 82 వేలు, సూర్యాపేటలో 42 వేలు పెండింగ్లో ఉన్నాయి. అయితే గతంలో వివిధ కారణాలతో రిజెక్ట్ చేసినవి, అప్పుడు దరఖాస్తు చేసుకోని వారు, మూడేండ్లలో కొత్తగా వచ్చిన అప్లికేషన్లకు మోక్షం కలుగడం కష్టంగానే కనిపిస్తున్నది. వీరికి కొత్తగా అవకాశం కల్పించ లేదు. రెవెన్యూ సదస్సుల్లో కొన్ని చోట్ల దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోరని తెలుస్తున్నది.