సూర్యాపేట టౌన్, జనవరి 14 : పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టి పడుతున్నది. మూడు రోజుల ముచ్చటైన పండుగ సంబురాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భోగి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. ఇంటి ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అందంగా అలంకరించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనల సంప్రదాయాలు కొనసాగాయి. బంధుమిత్రుల ముచ్చట్లు, పిండి వంటల ఘుమఘుమలు, చిన్నారుల పతంగుల ఎగురవేతతో పల్లెల్లో సందడి నెలకొన్నది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా రంగనాయక స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. మేళ్లచెర్వులో మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి ప్రజలు ఇచ్చే గౌరవమే సంక్రాంతి ; ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
వ్యవసాయానికి, రైతులకు తెలుగు ప్రజలు ఇచ్చే గౌరవమే మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 16వ వార్డులో భారత జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పలు వార్డుల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్లతోపాటు తమిళ, కన్నడ ప్రజలు, రైతులు జరుపుకొనే పండుగ సంక్రాంతి అన్నారు. చేతికొచ్చిన పంటలను ఆహార ధాన్యాలుగా మార్చుకునే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. చెడు ఆలోచనలు, పాత వస్తువులన్నీ భోగి మంటల్లో కలిసిపోవాలని, రైతన్నలకు శుభాలు జరుగాలని ఆకాంక్షించారు. సూర్యాపేట నియోజకవర్గ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు గాలిపటాలు బహూకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్, భారత జాగృతి జిల్లా కన్వీనర్ రంగినేని ఉపేందర్, జిల్లా కో కన్వీనర్ లక్కపాక ప్రవీణ్, మహిళా విభాగం కన్వీనర్ నీల ఉమా, వికలాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ నయీమ్, డాక్టర్ రామ్మూర్తి, బావుసింగ్ పాల్గొన్నారు.