తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మహిళా లోకం భగ్గుమన్నది. బండి మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. మహిళలు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి శవయాత్ర నిర్వహించారు. అనంతరం దహనం చేసి నిరసన తెలిపారు. సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. చట్టపరమైన చర్యల కోసం పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సంజయ్ తక్షణమే ఎమ్మెల్సీ కవితతోపాటు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగారు. బండి దిష్టిబొమ్మను దహనం చేసి.. సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ అగ్రనేతలు స్పందించి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుంటే తామే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
– నల్లగొండ ప్రతినిధి/ సూర్యాపేట, మార్చి 11 (నమస్తే తెలంగాణ)
Womens
సూర్యాపేట, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మహిళాలోకం భగ్గుమంది. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిరసనలు, రాస్తారోకోలు చేపట్టడంతో పాటు దిష్టిబొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నిరసనల్లో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తీరును ఎవరు వ్యతిరేకించినా వారిపైకి సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను ఎగేస్తూ ఇబ్బందులకు గురి చేసి పార్టీలో చేర్చుకోవడం లేదంటే కేసుల పాల్జేయడం ఐదారేండ్లుగా చూస్తున్నామని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వ పాలన, వారు చేస్తున్న తప్పులను సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు లేవనెత్తుతుండడంతో గిట్టని బీజేపీ పెద్దలు లేనిపోని అబాండాలు వేస్తూ ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తెలంగాణ బెదరదంటూ నినదించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను విచారణ నిమిత్తం ఈడీ శనివారం పిలిస్తే ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లకుండా నేరుగా విచారణ ఎదుర్కొనేందుకు వెళ్లిందని ఇదీ తెలంగాణ పౌరుషమని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే ఆయనకు మహిళలపై ఉన్న గౌరవం ఎలాంటిదో తెలిసిపోతుందన్నారు. దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మహిళలతో కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూర్యాపేటలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలో భారీ ర్యాలీ తీసి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున మహిళలు నిరసనలు తెలిపారు.
కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద, తుంగతుర్తిలో బీఆర్ఎస్ మహిళా సంఘం, నేరేడుచర్ల, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి క్రాస్‌రోడ్డు, హుజూర్‌నగర్‌తో పాటు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా, త్రిపురారం మండల కేంద్రంతో పాటు అన్ని పట్టణాలు, మండల కేంద్రాలే గాక గ్రామ స్థాయిలో సైతం మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి బండి సంజయ్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరిగింపుగా వెళ్లి చౌరస్తాల వద్ద దహనం చేశారు.
హాలియాలో బీఆర్ఎస్ యూత్ నాయకులు ఎస్ఐ క్రాంతికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతా ల్లో నాయకులు మాట్లాడుతూ హిందూ సంస్కృతికి తామే గుత్తేదారులమని చెప్పుకునే బీజేపీ కేంద్ర పెద్దలు తక్షణమే బండి సంజయ్‌తో తన పదవికి రాజీనామా చేయించి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో యావత్ మహిళా లోకం తిరగబడి మీ భరతం పడుతుందని హెచ్చరించారు. లేనిచో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు.