మునుగోడు, అక్టోబర్ 10 : బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావని, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన బీసీ సంఘాల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెపం నెట్టడమే తప్పా బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదన్నారు. చట్టబద్ధంగా పెంచిన బీసీ రిజర్వేషన్ల జీఓపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా నిరసిస్తుందని, ఇది బీసీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కింది నుంచి పైకోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ను కలిసుంటే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునే వాడని, బీజేపీ ఇదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అనడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లికార్జున్ యాదవ్, యువజన సంఘం కార్యదర్శి అనగంటి కృష్ణ, సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి, తోట నర్సింహ చారి, ఈదులకంటి కైలాసం, మాజీ సర్పంచ్ మిరియాల వెంకన్న, మాలిగా యాదయ్య, బొడ్డు నాగరాజు, జిట్టగొని యాదయ్య, నేరటి మల్లేష్ యాదవ్, మంటిపెళ్లి లక్ష్మణ్, జనిగల ముత్యాలు, బొల్లం సైదులు, బీసం కృష్ణ పాల్గొన్నారు.