నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంపూర్ణంగా ముగిసింది. తెల్లవారుజాము నుంచే బీసీ సంఘాల నేతలతో పాటు బీఆర్ఎస్ తదితర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు బంద్ విజయవంతం చేసేందుకు రోడ్లపైకి రావడంతో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం వరకు బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించగా సాయంత్రం 4 గంటల తర్వాత కార్యకలాపాలు స్వలం గా మొదలయ్యాయి. మొత్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఉదయం నుంచి జరిగిన బంద్ జిల్లా అంతటా విజయవంతంగా ముగిసిందని, సహకరించిన జిల్లా ప్రజలకు బీసీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ జీవో రూపంలో కంటి తుడుపుగా ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లపై ఆది నుంచి అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు సైతం స్టే విధించిన విషయం తెలిసిందే.
దీంతో స్టేకు నిరసనగా బీసీ సంఘాలు శనివారం బంద్‌కు పిలుపునివ్వగా బీఆర్ఎస్తో సహా ఇతర రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. నల్లగొండ జిల్లా అంతటా బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే బీసీ సంఘాల నేతలతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. బస్టాండ్‌లో బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం వరకు ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. ప్రయాణికులు సైతం బస్టాండ్‌కు వచ్చి వెనుదిరిగి ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూస్తూ కనిపించారు. మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి బస్సు డిపోల ఎదుట ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో రీజియన్ పరిధిలోని సుమారు 650కి పైగా బస్సులు మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక వ్యాపార వాణిజ్య సముదాయాలు సైతం పూర్తిగా మూతపడ్డాయి.
బంద్‌కు ఒకటిరెండు రోజుల ముందు నుంచే బీసీ సంఘాల నేతలు చేస్తున్న విజ్ఞప్తికి వ్యాపార వర్గాలు సహకరిస్తూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత గానీ దుకాణాలు తెరుచుకోలేదు. నల్లగొండలోని ప్రకాశం బజార్, ఎస్పీటీ మార్కెట్, ఎల్పీటీ మార్కెట్, హైదరాబాద్ రోడ్డులోని వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. ఇక పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు సైతం మూసివేశారు. జిల్లా అంతటా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోగా బంద్ నిర్వాహకులు వీటిని మూసివేస్తూ విద్యార్థులను బయటకు పంపించివేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలపై బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లోనూ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై, నార్కట్‌పల్లి-అద్దంకి, హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవేలపై బంద్ ప్రభావం కనిపించింది. పట్టణ, మండల కేంద్రాల మీదుగా వెళ్లే హైవేలపై ఆందోళనకారులు బైఠాయించడంతో పలుమార్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. బంద్ సందర్భంగా సాధారణ రోజుల్లో ఉండే రద్దీ శనివారం కనిపించలేదు. టోల్గేట్ల వద్ద కూడా హడావుడి లేదు. బంద్ సందర్భంగా అన్ని చోట్ల బీసీ సంఘాల నేతలు ర్యాలీలు నిర్వహిస్తూ సహకరించాలని ప్రజలను కోరారు. బంద్‌లో అన్నిచోట్లా బీఆర్ఎస్ నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారు. బీసీ సంఘాల నేతలతో కలిసి కదం తొక్కారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు బంద్ విజయవంతం కోసం కృషి చేశారు. కాం గ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు బైక్ ర్యాలీలతో వేర్వేరుగా పాల్గొన్నారు. నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న ఓ కార్ల షోరూంపై కొందరు బీజేపీ నేతలు రాళ్లు విసరడంతో స్వల్పంగా అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో నల్లగొం డ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్య కూడళ్లల్లో పోలీసు బృందాలను మోహరించి పర్యవేక్షించారు.