కట్టంగూర్, అక్టోబర్ 18 : బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లో శనివారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్తో పాటు బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. నకిరేకల్ పట్టణంలోని 65వ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలుపడంతో ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే పోలీసులు బీసీ నాయకులను పక్కకు జరిపి వాహనాలను రాకపోకలను పునరుద్ధరించారు. మరోవైపు వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం బంద్ కు మద్దతుగా నిలిచాయి. అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో శాంతియుత వాతావరణంలో ఈ బందు కొనసాగుతుంది.