మాడ్గులపల్లి, జూలై 06 : మాడ్గులపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 32 ప్రభుత్వ పాఠశాలలను సీపీఎం పార్టీ మండల నాయకత్వంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో తరగతి గదులకు సంబంధించి ఇందుగులలో 3, పాములపాడులో 2, చిరుమర్తిలో ఒకటి, పూసలపాడులో 2, కుక్కడంలో 3, గారకుంటపాలెంలో 2 గదుల కొరత ఉందన్నారు. కన్నెకల్ పాఠశాల స్థలం 8 ఎకరాల్లో ఉన్నందున మండలానికి రావాల్సిన ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అక్కడే నిర్మించాలన్నారు. మండలంలోని మొత్తం 32 పాఠశాలల్లో త్రాగునీటి సమస్య ఉందన్నారు. మంచినీరు లేక బయటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తున్నందున పాఠశాల అధ్యాపకులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వెంటనే అన్ని పాఠశాలల్లో మంచినీటి సదుపాయం కల్పించాలన్నారు.
దాదాపుగా సగం వరకు పాఠశాలల్లో టాయిలెట్స్ సమస్య ఉన్నందున విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అదే విధంగా అన్ని పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని హై స్కూల్లలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కొన్ని గ్రామాల్లో పాఠశాల ఆవరణలోనే గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్ లకు గదులు లేవన్నారు. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ క్లాసులకు అనుగుణంగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలు, ల్యాబ్ లు ఏర్పాటు చేసి టీచర్లను నియమించాలన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వలన విద్యార్థినులకు రక్షణ లేదన్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి ముగ్గు పోసి వదిలేశారన్నారు. విద్యార్థుల రక్షణ దృష్ట్యా వెంటనే నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రొండి శ్రినివాస్, మండల నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి, పుల్లెంల శ్రీకర్, పతాని శ్రీను పాల్గొన్నారు.