హాలియా, ఫిబ్రవరి 25 : ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సహకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బారులుదీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాలియాలోని కొత్తపల్లి సహకార సంఘ కార్యాలయం ఎదుట మంగళవారం రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడడం కనిపించింది. అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాల్లోని పలు గ్రామాల నుంచి రైతులు యూరియా కోసం ఉదయం ఏడు గంటలకు కొత్తపల్లి సహకార సంఘ కార్యాలయం వద్దకు వచ్చారు. ఏమీ తినకుండా రావడం, దాహం తీర్చుకోవడానికి కూడా కనీసం నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నుంచి రెండు, మార్క్‌ఫెడ్ నుంచి ఒక్క లారీ యూరియా హాలియాకు రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
సహకార సంఘ సిబ్బంది యూరియా పంపిణీని మొదలు పెట్టడంతో యూరియా దొరుకుతదా లేదా అని రైతులు ఎగబడ్డారు. ఉదయం నుంచి పనులు మానుకొని ఎండలో నిలబడి యూరియా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్‌కు డబ్బులు కట్టినప్పటికీ అక్కడ యూరియా స్టాక్ లేకపోవడంతో సకాలంలో పంపలేదని సహకార సంఘ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మంగళవారం వచ్చిన 1,565 బస్తాల యూరియాలో 141 మంది రైతులకు 1,500 బస్తాలు విక్రయించినట్లు చెప్పారు. యూరియా కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి సరిత తెలిపారు.