మిర్యాలగూడ, ఫిబ్రవరి 5: మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి, 56 రోజులపాటు చిప్పకూడు తిన్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని, ఆయనపై ఇప్పటికీ 86 కేసులు ఉన్నాయని అన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా తీసుకున్న తరువాత కూడా కుక్క తోక వంకర అనే విధంగా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. కేసీఆర్ 14 ఏండ్ల పాటు ఉద్యమాలు చేసి కేంద్ర మంత్రి పదవి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన నాయకుడన్నారు.
ఆయన కారణంగానే నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఆయన ఎప్పటికీ తెలంగాణకు జాతిపితనే అని అన్నారు. కేసీఆర్‌ను తిడితే గొప్పవాడిని అవుతానని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నాడని, కాని తెలంగాణ ప్రజలు ఆయన భాషను చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమన్నారు. బూట్లు తుడిచిన చరిత్ర రేవంత్‌రెడ్డిదేనని.. అది గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి తనపై విమర్శలు చేయడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చింది… ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ తనకు పూర్తిగా తెలుసని, ఆయన ఎవరి కాళ్లు పట్టుకుంది… ఎవరి బూట్లు తుడిచింది ఫొటోలతో సహా ఉన్నాయని, ఇది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. తనను జానారెడ్డి ఎన్నడూ పల్లెత్తు మాటా కూడా అనలేదని, ఆయనతో కలిసి తాను పార్టీలో కలిసి పనిచేశానన్నారు.
జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్.. ఏం చేశావ్ అనేది గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌ను జాతిపిత కాదనడానికి రేవంత్ ఎవరన్నారు. కాంట్రాక్టర్లను, ఆఫీసర్లను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నీదని అన్నారు. చిల్లర మాటల వల్ల ఆయన విలువే దిగజారుతోందన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడితే ప్రజలు గౌరవిస్తారని, మాటలు తూలితే వారే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. మిర్యాలగూడలో నామినేషన్ వేయకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. స్వార్థంతోనే ఆయన తన కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించారని, అది బెడిసి కొట్టడంతో కట్టుకథ అల్లుతున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్దార్ధ, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, కట్టా మల్లేష్‌గౌడ్, కుందూరు వీరకోటిరెడ్డి, హాతీరాం, బాలసత్యనారాయణ ఉన్నారు.