నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా అంతటా అల్పపీడన ప్రభావంతో కురిసిన ఆస్మా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు నల్లగొండ జిల్లా సగటు వర్షపాతం 10.9 సెంటీమీటర్లు నమోదైంది. అత్యధికంగా కేతేపల్లిలో 16.8సెంటీమీటర్లు కురిసింది.
వేములపల్లిలో 16.3, చండూరులో 15.4, మిర్యాలగూడలో 14.5, కొండమల్లేపల్లిలో 13.8, గట్టుప్పల్‌లో అతి తక్కువగా 3.5సెం.మీటర్ల వర్షం కురిసింది. ఇక ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్ష ప్రభావం కనిపించింది. నార్కట్‌పల్లిలో 4.9 సెంటీమీటర్లు, చిట్యాలలో 2.4, కట్టంగూర్‌లో 2.2, శాలిగౌరారంలో 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ చిరుజల్లులు మినహా వర్షం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షంతో అంతరాయాలు
నల్లగొండ పట్టణంలోని ఎఫ్‌సీఐ కాలనీ, పాతపల్లె, శేషమ్మగూడెం కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో కోటప్పమత్తడి వద్ద జేసీబీతో వరదను క్లియర్ చేశారు. కేతేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌తో పాటు ప్రైమరీ పాఠశాల భవనాలపై చెట్లు విరిగిపడడంతో భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇదే మండలంలోని కొత్తపేట పెద్దచెరువు అలుగు పోయగా ఉప్పలపహాడ్ వద్ద వరద నీటిలో వరి పొలాలు మునిగిపోయాయి.
నల్లగొండ ఆర్డీఓ రవి, తాసీల్దార్ మధుసూదన్‌రెడ్డి సందర్శించి తగు చర్యలకు ఆదేశించారు. త్రిపురారం మండలం పలుగుతండాలో కరెంటు స్తంభాలు విరిగిపడగా తుంగపాడు వాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. పలువరు కరెంటు మోటార్లు వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండలోని మోతికుంట వద్ద వరద ఉధృతిని అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రవి సమీక్షించి తగిన ఆదేశాలిచ్చారు.
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై భారీ చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. తక్కెళ్లపాడు సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన వంతెన వరద ఉధృతికి కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండమల్లేపల్లిలోని అంబేద్కర్ కాలనీలోకి వరద నీరు వచ్చి ఇండ్ల మధ్య నిలువడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వద్ద మూసీ ఉధృతిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కలిసి పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మండలంలోని అమ్మనబోలు నుంచి రామానుజపురం వెళ్లే దారిలో లోలెవల్ కల్వర్టుపై నుంచి వరద ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తిప్పర్తి మండలం కాశివారిగూడెంలో కాల్వకు గండిపడగా డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్ఐ డి.రాజు ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు.
నార్కట్‌పల్లి, నకిరేకల్ వద్ద దారి మళ్లింపు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద దారి మళ్లించారు. కోదాడ మండలం నల్లబండగూడెం శివారులోని రామాపురం బ్రిడ్జి వద్ద హైవేపై నీరు ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి నుంచి మిర్యాలగూడ, వాడపల్లి, గుంటూరు మీదుగా విజయవాడకు వెళ్లేలా ఆదేశాలిచ్చారు. ఇక హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలను కూడా నకిరేకల్ వద్ద దారి మళ్లిస్తున్నారు.
కూసుమంచి మండలంలోని పాలేరు వద్ద హైవేపైకి వరద నీరు రావడంతో ఖమ్మం వైపు వెళ్లాల్సిన వాహనాలను నకిరేకల్ నుంచి అర్వపల్లి, మరిపెడబంగ్లా మీదుగా ఖమ్మం వైపు దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానం ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంపై భాగంలో ఉండే మూడు గుండ్ల దర్శనాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.