మునుగోడు, మార్చి 26 : రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పరిధిలోని కొరటికల్ గ్రామంలో బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమంపై వివక్ష చూపిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి కొబ్బరి పీసు తింటూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది దివ్యాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్భర జీవితాలు గడుపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయకుండా, ప్రజా పాలన పేరుతో సంబరాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతామని, రాష్ట్రంలో దివ్యాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల సంక్షేమ శాఖను వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారన్నారు.
కాగా నేడు దివ్యాంగ సమాజంపై వివక్ష ప్రదర్శిస్తూ, బడ్జెట్లో పైసా నిధులు కేటాయించని తీరు తమను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లనే ఇస్తూ పెన్షన్ల పెంపునకు కృషి చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి హామీలను నెరవేర్చేందుకు ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల తరహాలో తెలంగాణ దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, లేకుంటే భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అలాగే వేలాదిమంది దివ్యాంగులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు తలారి సహదేవుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక మత్స్యగిరి, మునుగోడు మండల ఉపాధ్యక్షుడు ఓంటేపాక ముత్తయ్య, చింతపల్లి మండల అధ్యక్షుడు నర్రావుల నరేందర్, చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు వెంకన్న, జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు, చండూరు మండలం మహిళా అధ్యక్షురాలు కారింగ్ రేణుక, చండూరు మండల ఉపాధ్యక్షుడు పల్లెగోని రవి, చండూరు మండలం యూత్ అధ్యక్షుడు బొమ్మర గోని శ్రీకాంత్, కొరటికల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రొమ్ముల ప్రవీణ్ పాల్గొన్నారు.