పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. సూపర్-8 దశలో భాగంగా ఇదివరకే శ్రీలంకను ఓడించిన ఆ జట్టు.. మంగళవారం పల్లెకెలెలో జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తుచేసి సెమీస్ చేరుకుంది. పాక్ నిర్దేశించిన 165 పరుగుల ఛేదనను ఆ జట్టు.. 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో ఆ జట్టును సెమీస్‌కు చేర్చాడు.
పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది (4/30), ఉస్మాన్ తారిఖ్ (2/31) రాణించినా బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 63, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫకార్ జమాన్ (16 బంతుల్లో 25, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక ఈ ఓటమితో సెమీస్ చేరే అవకాశాలను పాకిస్థాన్ మరింత సంక్లిష్టం చేసుకుంది.
మోస్తరు ఛేదనలో ఇంగ్లండ్ కూడా ఆరంభం నుంచే ఆపసోపాలు పడింది. షహీన్ అఫ్రిది వరుస ఓవర్లలో ఇంగ్లిష్ ఓపెనర్లను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. తొలి బంతికే ప్రమాదకర ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసిన అతడు.. మూడో ఓవర్లో బట్లర్ (2)నూ వెనక్కి పంపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన ఇంగ్లండ్ సారథి క్రీజులో పట్టుదలగా ఆడినా అతడికి సహచరుల నుంచి మద్దతు కరువైంది. అఫ్రిదికి తోడు స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ మాయతో ఆ జట్టు బెతెల్ (8), బాంటన్ (2), కరన్ (16) వికెట్లను నష్టపోయింది. అయినా బ్రూక్ మాత్రం పట్టు వీడలేదు. మిర్జా రెండో ఓవర్లోనే 76 మీటర్ల సిక్స్‌తో వేట మొదలుపెట్టిన అతడు.. నవాజ్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో 4, 4, 6 బాది తన ఉద్దేశాన్ని చాటాడు.
ఒకపక్క పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచినా కెప్టెన్ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అతడు.. షాదాబ్ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 17 పరుగులు రాబట్టాడు. కరన్‌ను తారిఖ్ బోల్తా కొట్టించినా ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (28) తో కలిసి ఆ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. ఉస్మాన్ ఓవర్లో బౌండరీతో 90లలోకి వచ్చిన బ్రూక్.. అఫ్రిది 17వ ఓవర్లో 6,4తో తన కెరీర్లో తొలి టీ20 శతకాన్ని పూర్తిచేశాడు. శతకం తర్వాతి బంతికే అతడు ఔట్ అయ్యాడు. విజయానికి 5 పరుగులు అవసరమనగా నవాజ్ ఓవర్లో జాక్స్, ఒవర్టన్ నిష్క్రమించడంతో ఉత్కంఠ రేగినా ఆర్చర్ బౌండరీతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
పాక్ ఇన్నింగ్స్‌లో ఫర్హాన్ ఆటే హైలైట్. ఎప్పట్లాగే ఆ జట్టు ఒడిదొడుకులతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా ఫర్హాన్ క్రీజులో నిలిచి ‘మెన్ ఇన్ గ్రీన్’కు మెరుగైన స్కోరును అందించగలిగాడు. ఆర్చర్ రెండో ఓవర్లో ఓపెనర్ సయీం అయూబ్ (7) మరోసారి నిరాశపరచగా డాసన్ మూడో ఓవర్లో కెప్టెన్ సల్మాన్ అఘా (5) కూడా అతడినే అనుసరించాడు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్ (25)తో కలిసిన ఫర్హాన్ ధాటిగా ఆడే యత్నం చేశాడు. కానీ పవర్ ప్లే తర్వాత ఈ జోడీ సింగిల్స్‌కు పరిమితమవడంతో స్కోరు వేగం తగ్గింది.
ఒవర్టన్ 11వ ఓవర్లో బాబర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన ఫకార్ (23) రెండు బౌండరీలు, రెండు సిక్సర్లతో వేగంగా ఆడాడు. జాక్స్ 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో అర్ధ శతకాన్ని పూర్తిచేసిన ఫర్హాన్‌ను ఒవర్టన్ 16వ ఓవర్లో ఔట్ చేశాడు. అక్కడ్నుంచి పాక్ ఇన్నింగ్స్ గాడితప్పింది. ఫర్హాన్ నిష్క్రమించే సమయానికి 15.1 ఓవర్లలో 122/3గా ఉన్న పాకిస్థాన్, ఆ తర్వాత 4.2 ఓవర్లలో 43 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది.
1 టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అత్యధిక స్కోరు చేసిన వారిలో బ్రూక్‌దే అగ్రసానం. గేల్ (98) రెండో స్థానంలో ఉన్నాడు.
3 ఈ మెగా టోర్నీలో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన వారిలో బ్రూక్ (50 బంతుల్లో)ది మూడో స్థానం. తొలి రెండు స్థానాల్లో గేల్ (47, 50) ఉన్నాడు.
పాకిస్థాన్: 20 ఓవర్లకు 164/9 (ఫర్హాన్ 63, ఫకార్ 25, డాసన్ 3/24, ఒవర్టన్ 2/26);
ఇంగ్లండ్: 19.1 ఓవర్లకు 166/8 (బ్రూక్ 100, జాక్ 28, అఫ్రిది 4/30, ఉస్మాన్ 2/31)