వాషింగ్టన్: ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేస్తామంటూ ఒక వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడమే కాక, పశ్చిమాసియాలో శక్తిమంతమైన నౌకలను మోహరిస్తున్నారు. అందులో యూఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్ట్ నౌక ఒకటి. అయితే ఇందులోని 4,500 మంది నావికులు ఇరాన్‌పై యుద్ధం చేయడం మాట అటుంచి ముందు ఆ భారీ నౌకలో నిత్యం టాయిలెట్ల కోసం వారిలో వారే కొట్లాడుకుంటున్నారు. ఈ యుద్ధ నౌకలోని టాయిలెట్లు, మురుగునీటి వ్యవస్థ వైఫల్యం కారణంగా వారు రోజూ తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నౌక 2025 జూన్ నుంచి సముద్ర జలాల్లోనే ఉంది. రూ.1.1 లక్షల కోట్ల విలువజేసే ఈ నౌకలోని టాయిలెట్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
నౌకలోని 650 టాయిలెట్లలో చాలా వరకు పనిచేయడం లేదు. సరైన నిర్వహణ లేకపోవడం, నౌక నిరంతరం నదీజలాల్లో పయనిస్తుండటం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. దీంతో పనిచేస్తున్న కొన్ని టాయిలెట్ల ముందు నావికులు రోజూ యుద్ధమే చేయాల్సి వస్తున్నది. ప్రతి రోజూ క్యూలలో నిల్చుని 45 నిమిషాల పాటు దీనికే వెచ్చించాల్సి వస్తున్నదని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే అంతే సంగతులని వారు వాపోతున్నారు. దీంతో ప్రతిరోజూ నావికులకు, ఓడ ప్లంబ్లింగ్ పనులు చేసే టెక్నీషియన్లకు మధ్య గొడవలు జరగుతున్నాయి. టాయిలెట్ల నిర్వహణకు రోజూ 19 గంటలు పనిచేస్తున్నామని అంతకంటే తాము ఏం చేయగలమని ఈ టెక్నీషియన్లు ప్రశ్నిస్తున్నారు.