వాషింగ్టన్, ఫిబ్రవరి 24 : అమెరికా ఈశాన్య ప్రాంతాలను భారీ మంచు తుఫాన్ ’హెర్నాండో’ అతలాకుతలం చేస్తున్నది. న్యూయార్క్ నగరం మొదలు మసాచుసెట్స్ దాకా 8 రాష్ర్టాల్లో మంచు తుఫాన్ కమ్మేసింది. మేయర్ మమ్దానీ న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర రవాణా సేవలు తప్ప, ఏవీ అందుబాటులో ఉండవని ప్రకటించారు. అమెరికా వ్యాప్తంగా మంగళవారం నాటికి 11 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
దాదాపు 5 లక్షలకు పైగా ఇండ్లు, ఇతర కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మసాచుసెట్స్‌లో ‘వైట్ ఔట్’ పరిస్థితులు నెలకొన్నందున రోడ్లపైకి రావొద్దని వాహన డ్రైవర్లను ఆదేశించారు. ఆదివారం, సోమవారం మన్‌హట్టన్ సెంట్రల్ పార్క్‌లో 50 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. పలు రాష్ర్టాల్లో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది.