దుబాయ్: ప్రస్తుతం భారత్, శ్రీలంకలో జరుగుతున్న పురుషుల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన కొద్దినెలలకే అమ్మాయిల పొట్టి పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీని జూన్ 12 నుంచి జులై 05 దాకా నిర్వహించనుండగా ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. పదో ఎడిషన్‌గా జరుగబోయే ఈ మెగా టోర్నీలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 12 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
12 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా భారత్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దాయాది పాకిస్థాన్‌తో కలిసి గ్రూప్-1లో ఉంది. గ్రూప్-2లో వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. జూన్ 12 నుంచి 28 దాకా లీగ్ మ్యాచ్‌లు జరుగనుండగా జూన్ 30, జులై 2న ‘ది ఓవల్’లో సెమీస్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జులై 5న ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది. జూన్ 14న భారత జట్టు.. పాకిస్థాన్‌తో ఆడబోయే మ్యాచ్‌తో టోర్నీని ఆరంభించనున్నది.