చెప్పింది చెప్పినట్లు అమలు చేసి చూపడంలో బీఆర్ఎస్ సర్కారుకు సాటి లేదంటే అతిశయోక్తి కాదేమో! ఇవ్వని హామీలను సైతం ప్రజావసరాల దృష్ట్యా ఆచరణలో పెడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో కనిపిస్తున్న వేల కోట్ల రూపాయల అభివృద్ధే ఇందుకు సాక్ష్యం. ఇక్కడ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరడంతో నియోజకవర్గం రూపురేఖలే మారిపోతున్నాయి. దాదాపు రూ.3,500 కోట్ల రూపాయల పనులు ముమ్మరంగా సాగుతుండగా, ఈఎస్ఐ దవాఖానతోపాటు ఇప్పటికే పూర్తయిన వాటిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సహచర మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడుకు ఇచ్చిన హామీలను సైతం ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది. ఇప్పటికే చౌటుప్పల్‌లో డయాలసిస్ సెంటర్, మర్రిగూడలో 30 పడకల దవాఖానను అందుబాటులోకి తెచ్చింది. చౌటుప్పల్ నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు పనులు మొదలయ్యాయి. గురువారం రూ.7కోట్లతో సరంపేటతండాకు బీటీ రోడ్డు మంజూరు చేసింది. శుక్రవారం చండూరు మున్సిపాలిటీ, గట్టుప్పల్‌లో 43.64 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి కేటీఆర్ హుజూర్నగర్, చండూరులో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కలెక్టర్ వినయకృష్ణారెడ్డి ఆయా చోట్ల ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
– నేరేడుచర్ల / చండూరు, జనవరి 5
మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు.. హుజూర్‌నగర్‌లో..
మునుగోడు నియోజకవర్గంలో..
నేరేడుచర్ల, జనవరి 5 : సీఎం కేసీఆర్ హామీ మేరకు నియోజకవర్గంలో సుమారు రూ.3500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, మరికొన్ని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తయిన కార్యాలయాల ప్రారంభోత్సవంతోపాటు మరి కొన్ని పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం హుజూర్నగర్ రానున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా హుజూర్నగర్ పట్టణం గులాబీ తోరణాలతో ముస్తాబైంది. ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించే బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
మంత్రుల పర్యటన ఇలా..
బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన
హుజూర్నగర్, జనవరి 5 : హుజూర్‌నగర్‌లో మంత్రుల పర్యటనకు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్డు సమీపంలోని మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. సభకు మంత్రి జగదీశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, కౌన్సిలర్లు గురువయ్య, గంగరాజు, సైదులు పాల్గొన్నారు.
అధికారులతో కలెక్టర్ సమీక్ష
మంత్రుల పర్యటన నేపథ్యంలో గురువారం హుజూర్నగర్ ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా వ్యవహరించి మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలన్నారు. అనంతరం జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకారెడ్డి, తాసీల్దార్ దామోదర్‌రావు, ఆర్ అండ్ బీ డీఈ మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ స్వాతిరెడ్డి పాల్గొన్నారు.
ప్రారంభించనున్న పనులు
నేరేడుచర్ల మున్సిపాలిటీలో రూ.13లక్షలతో నిర్మించే బస్తీ దావఖాన, రూ.10 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు, గరిడేపల్లి మండలంలో రూ.20కోట్లతో చేపట్టే కీతవారిగూడెం – మునగాల రోడ్డు పనులను, రూ.కోటీ 96లక్షలతో నిర్మిస్తున్న మర్రికుంట బ్రిడ్జి, రూ.కోటీ 36 లక్షలతో కుతుబ్షాపురం వంతెన, రూ.49.10లక్షలతో కరక్కాయలగూడెం వంతెన, రూ.18లక్షలతో వేపలసింగారం వంతెన నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. హుజూర్‌నగర్‌లోని లింగగిరి రోడ్డు నుంచి వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు రూ.5.30 కోట్లతో చేపట్టే రోడ్డు పనులను, రూ.6కోట్లతో హుజూర్నగర్ ఔటర్ రింగ్‌రోడ్డు పనులను, రూ.13లక్షలతో మాదవరాయినిగూడెంలో బస్తీ దవాఖాన, రూ.13లక్షతో హుజూర్నగర్ 12వ వార్డులో నిర్మించే బస్తీ దవాఖాన పనులను ప్రారంభిస్తారు.
పటిష్ట బందోబస్తు
హుజూర్నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటటర్ సమీపంలో ఏర్పాటు చేసే సభలో సుమారు 50వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రానున్నందున సభా ప్రాంగణం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలకు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.