యాదగిరిగుట్ట, మే 23: సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా సాగింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు..మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలతో రైతుల నిరసన ప్రదర్శనలు, కొండపైన వర్తక సంఘం రద్దు కోరుతూ యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలతో ఇది దేవస్థానమా.. రాజకీయ పార్టీ కార్యక్రమా అన్నట్టు కార్యక్రమాలు కొనసాగాయి. కాగా ప్రకటించిన షెడ్యూల్‌ను భిన్నంగా ముఖ్యమంత్రి పర్యటనతో దేవస్థానం పరిధిలోని టెంపుల్ సిటీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల భవనానికి భూమిపూజ జరిగింది. శనివారం ఉదయం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి టెంపుల్ సిటీ హెలిప్యాడ్‌పై దిగారు. అక్కడి నుంచి నేరుగా వేద పాఠశాల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో సీఎం వెళ్లి సంప్రదాయ దుస్తులు ధరించారు. అక్కడి నుంచి కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి భూమిపూజ జరిగే ప్రాంతానికి వెళ్లారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండాసురేఖ, రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఉదయం 9.37 గంటలకు భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రిని కంచి కామకోటి పీఠాధిపతి ఆశీర్వదించారు. అనంతరం రోడ్డు మార్గం గుండా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ మండపంలో వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి మహాప్రసాదం, ప్రతిమను అందజేశారు.
షెడ్యూల్‌కు భిన్నంగా..
ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా శనివారం ముఖ్యమంత్రి పర్యటన సాగింది. హెలికాప్టర్‌పై ఉదయం 8.35 గంటలకు యాదగిరిగుట్టలోని గోశాల ప్రాం తంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుని 9.10 గంటల్లోపు స్వామివారి దర్శ నం, పూజ నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి షెడ్యూల్ వచ్చిం ది. ఆ తర్వాత 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు టెంపుల్ సిటీపై నిర్మించే వేద పాఠశాల భూమిపూజలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రెసిడెన్సియల్ సూట్‌కు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెళ్తారని షెడ్యూల్లో ఉంది. దీంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రోటోకాల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు, కాన్వాయి, కలెక్టర్, పోలీసు సిబ్బంది, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఆలయ అధికారులు గోశాల ప్రాంతంలోని హెలీప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. షెడ్యూల్‌కు భిన్నంగా సీఎం హెలికాప్టర్‌పై టెంపుల్ సిటీపైన ఉన్న హెలిప్యాడ్‌పై దిగి నేరుగా వేదపాఠశాలకు భూమిపూజ జరిగే ప్రాంతానికి వచ్చారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యే, సీఎం భద్రతా సిబ్బంది, పోలీసు బందోబస్తు అధికారుల్లో ఆయోమయం నెలకొంది. సీఎం టెంపుల్ సిటీపై దిగారని తెలుసుకుని వెంటనే అక్కడకు వెళ్లడంతో అప్పటికే సీఎం భూమి పూజ జరిగే ప్రాంతానికి వచ్చారు. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాత్రమే సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలకడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. షెడ్యూల్‌కు భిన్నంగా సీఎం పర్యటన ఉందని, ఇది సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని పలువురు అభిప్రాయపడ్డారు.
పాదరక్షలతోనే వేదపాఠశాల ప్రాంగణంలోకి..
వేద పాఠశాలకు భూమి పూజ చేసే ప్రాంతంలో పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది పాదరక్షలతోనే పాల్గొన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోదరుడు బీర్ల శంకర్, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళపల్లి శ్రీవాణి భర్త రవి కుమార్‌తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాదరక్షలతో రావడంతో అక్కడే ఉన్న దేవస్థాన అధికారులు గమనించి అభ్యంతం చెప్పడంతో వారు చెప్పులు వదిలి వెళ్లారు.
మండలి చైర్మన్ గుత్తాకు అవమానం
యాదగిరిగుట్ట, మే 23: మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి శనివారం దేవస్థానంలో అవమానం జరిగింది. సీఎం కు వేదాశీర్వచనం అందజేసే సమయంలో గుత్తా కూర్చొ నేందుకు అవకాశం కల్పించ కుండా వెనుకనే నిలబెట్టి సీఎం, మంత్రులు, దేవస్థానం అధికారులు అవ మానపర్చారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం తర్వాత ఉన్నత స్థానంలో ఉన్న మండలి చైర్మన్‌కు సీఎం, దేవస్థాన అధికారులు కనీస గౌరవ ఇవ్వలేదు. దీం తో సుమారు 15 నుంచి 20 నిమిషాలపాటు గుత్తా సీఎం వెనుకే నిలబ డ్డారు. అనంతరం బయటకు వెళ్లే పశ్చిమ పంచతల రాజగోపురం వద్ద సైతం ఆయనతో ఫొటో దిగేం దుకు సీఎం నిరాకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ మండలి చైర్మన్‌కు గొప్ప గౌరవం ఇచ్చే వారు. ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి తనతో సమానంగా గౌరవం దక్కేలా ప్రవర్తించే వారు. కానీ రేవంత్‌రెడ్డి తీరు ఇందుకు భిన్నంగా ఉందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.