లక్నో: ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అంత్యక్రియల కోసం వాహనంలో తరలిస్తుండగా ఆమె శరీరంలో కదలికలను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా ఆ మహిళ బతికే ఉన్నట్లు తెలుసుకుని చికిత్స అందిస్తున్నారు. (Woman alive At Last Rites) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. 65 ఏళ్ల షీలా దేవి దీర్ఘకాలిక కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నది. ఢిల్లీ ఆసుపత్రిలో కామెర్లకు చికిత్స పొందింది. ఉత్తరప్రదేశ్లోని బదాయూన్ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న చిన్న కుమారుడు సంజీవ్ కుమార్తో కలిసి ఆమె నివసిస్తున్నది.
కాగా, షీలా దేవి అనారోగ్యం చెందటంతో బరేలీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు అక్కడి వైద్యులు మంగళవారం రాత్రి నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
మరోవైపు అంత్యక్రియల కోసం వాహనంలో ఆగ్రాకు తరలిస్తుండగా 24 గంటల తర్వాత బుధవారం రాత్రి వేళ షీలా దేవి శరీరంలో కదలికలను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె శ్వాసతీసుకోవడం గమనించి ఆగ్రాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ వృద్ధురాలు బతికి ఉన్నట్లు తెలుసుకుని ఆమెకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని, ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.