Cockroach Party : ఇండియాలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. బహుశా.. సీజేపీని స్ఫూర్తిగా తీసుకున్నారో.. ఏమో కానీ.. పాకిస్తాన్లో కూడా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ (సీపీపీ) పేరుతో ఒక పార్టీ ప్రారంభమైంది. ఇది ప్రస్తుతం ఆన్లైన్ వరకే పరిమితమైంది. పాకిస్తాన్కు చెందిన సల్మాన్ తరార్ అనే విద్యార్థి న్యూయార్క్లో ఉంటున్నాడు. అతడే సీపీపీని స్థాపించాడు. పాకిస్తాన్లో అవినీతిని అంతం చేయడం, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకించడం, గౌరవ ప్రదమైన రాజకీయాలు నడిచేలా చేయడం తమ లక్ష్యమని సీపీపీ ఫౌండర్ సల్మాన్ అంటున్నాడు.
తమ ఉద్యమంలో యువతను భాగస్వాముల్ని చేస్తామని, వారి గళాన్ని వినిపిస్తామని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి సీపీపీ పేరుతో గత మేలోనే ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ అయింది. ఇది కెనడా కేంద్రంగా కొనసాగుతుండగా, ఇటీవలే వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది. సీపీపీకి ఇప్పటికే ఇన్స్టాలో 1,12,000 మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. మెరుగైన పాలన, రాజకీయాల్లో పారదర్శకత వంటివి లక్ష్యాలుగా చెబుతోంది. తన సీపీపీ లోగోలో మెజారిటీ ప్రజలకు ప్రతినిధిగా చెబుతూ, మైనారిటీలకు రక్షణగా ఉంటామని పేర్కొంది. యునిటీ ఫెయిత్ డిసిప్లైన్ అనే క్యాప్షన్ కూడా ఉంది. ఇప్పటికే ఈ అకౌంట్ చాలా యాక్టివ్గా పని చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఆందోళనకారులపై జరుగుతున్న అణచివేతలను ప్రస్తావిస్తోంది. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా వివరిస్తోంది. ఇదే సమయంలో సీపీపీకి వివిధ హోదాల్లో పని చేసే వారి నుంచి దరఖాస్తులు కూడా కోరుతోంది.
అవినీతిని అంతం చేయడం, వారసత్వ రాజకీయాల్ని అడ్డుకోవడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, చమురు సంక్షోభానికి పరిష్కారం, నీటి కొరతను ఎదుర్కోవడం, ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని సాధించడం ప్రధాన లక్ష్యాలుగా సీపీపీ చెబుతోంది. అయితే, పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో స్పష్టత లేదు. ఇటీవల దేశంలో సీజేపీ చేపట్టిన ఉద్యమానికి పాకిస్తాన్ నుంచి చాలా మంది మద్దతు తెలిపారు. కానీ, అక్కడ మాత్రం ఇలాంటి ప్రజాస్వామిక పరిస్థితులు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆందోళనకారుల్ని ప్రభుత్వం దారుణంగా అణిచివేస్తుంది. ప్రభుత్వం తీవ్ర హింసకు పాల్పడుతుంది.