దామరచర్ల, సెప్టెంబర్ 20 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విద్యార్థులకు ఉపయోగపడేలా కాకుండా, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట తర్వాత జరగాల్సిన సర్దుబాట్లను మూడు నెలలు ఆలస్యం చేయడంతో పాటు ఇప్పుడు ఇచ్చిన డిప్యుటేషన్లు కూడా పారదర్శకత లేకుండా ఇష్టారీతిన జరిగాయి. డిప్యుటేషన్లు జరిపేటప్పుడు కో ఆర్డినేషన్ మీటింగ్ జరిపి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంఘాల ప్రతినిధుల సమక్షంలో సమావేశం జరిపి వాస్తవ పరిస్థితిని పరిశీలించి డిప్యూటేషన్స్ జరపాలని గతంలో ఎంఈఓ బాలాజీ నాయక్ ను కోరినప్పటికీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం వల్ల. మొన్న విడుదలైన డిప్యూటేషన్లలో దామరచర్ల మండలానికి సంబంధించి అనవసర పాఠశాలలకు టీచర్లను కేటాయించడం, అవసరం ఉన్నచోట టీచర్ల కేటాయింపు జరగకుండా అసమంజస సర్దుబాట్లు జరిగాయి.
– MPPS తెట్టెకుంట పాఠశాలలో 23 మంది విద్యార్థులకు అక్కడ సరిపడా ఉపాధ్యాయులు (ఇద్దరు) పని చేస్తున్నారు. అయినప్పటికీ అనధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలతో అక్కడ MPPS నూనావత్ తండా నుండి పుల్లయ్య అను SGT ని డిప్యూటేషన్ వేయడం జరిగింది
– MPPS బండవత్ తండా పాఠశాలలో విద్యార్థులు లేకున్నా అక్కడ MPPS కేశవరపురం నుండి వి.రాంబాబు SGT ని కేటాయించారు.
– MPPS మాన్ తండా పాఠశాలలో 19 మంది విద్యార్థులకు అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అక్కడ అవసరం లేకున్నా MPPS రాజగట్టు పాఠశాల ఉపాధ్యాయులు జి.సాంబశివ రావు SGT ని కేటాయించారు.
– MPPS ఇందిరానగర్ తండా పాఠశాలలో 5 మంది విద్యార్థులకు అక్కడ ఒక ఉపాధ్యాయుడు పని చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ రామదాసు SGT ని కేటాయించారు.
– ZPHS కల్లేపల్లి పాఠశాలలో అందరూ సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. అయిననూ అక్కడ నిబంధనలకు విరుద్ధంగా MPPS పుట్టలగడ్డ పాఠశాల నుండి డి.నాగరాజు SGT ని డిప్యుటేషన్ వేయడం జరిగింది.
– MPPS గణేష్ పహాడ్ పాఠశాలలో 67 మంది విద్యార్థులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండగా అక్కడ నుండి MPPS వాడపల్లికి పి.సైదయ్య SGT ని కేటాయించడం జరిగింది. అక్కడ తరగతికి ఒక టీచర్ అవసరం.
– MPPS దిలావర్పూర్ పాఠశాలలో 72 మంది విద్యార్థులకు గాను అక్కడ 5 గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయిననూ అక్కడికి MPPS కొత్తపేటతండా పాఠశాల నుండి ఎన్.శ్రీనివాస్ SGT, డి.గీతారాణి SGT ఇద్దరిని ఒకే పాఠశాలకు కేటాయించారు.
ఈ విధం గా అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్లు పునఃపరిశీలించాలని, వీటిని సరి చేయాలని ఎంఈఓ బాలాజీ నాయక్ కు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ దామరచర్ల మండలాధ్యక్షుడు భూక్యా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు పేరం సైదమ్మ, ప్రధాన కార్యదర్శి చెలకపల్లి శ్యామ్ కుమార్, కోశాధికారి కోడిదల వెంకటేశ్వర్లు తమ బృందంతో మెమొరాండం సమర్పించారు.