సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌కు మరో కొత్త రహదారి రాబోతున్నది. ఇప్పటికే కలెక్టరేట్‌కు మూడు రోడ్లు ఉండగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో నాలుగోది ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సోమవారం రూ.12.10 కోట్లు విడుదల చేసింది. కలెక్టరేట్‌కు ప్రస్తుతం పట్టణంలోని ఎక్స్టెన్షన్ 60 ఫీట్ల రోడ్డు నుంచి ఒకటి.. కుడకుడ నుంచి మరొకటి.. ఖమ్మం క్రాస్ రోడ్డు మూసీ కాల్వ మీదుగా ఇంకొక రహదారి ఉన్నది. తాజాగా సూర్యాపేట-ఖమ్మం రహదారిలోని బీబీగూడెం నుంచి 2.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. ఇది పూర్తయితే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు సూర్యాపేట పట్టణంలోకి రాకుండానే నేరుగా కలెక్టరేట్‌కు చేరుకోవచ్చు.
– సూర్యాపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీరు, రహదారులు, విద్యుత్ తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గతంలో ఉన్న గుంతల రోడ్లు, సాగు నీటి ఇక్కట్లు తప్పడంతో పాటు, విద్యుత్ కోతలు తప్పాయి. వేల కోట్లు వెచ్చించి రహదారుల నిర్మాణాలు, మిషన్ భగీరథతో తాగునీరు, కాళేశ్వరంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. అదేవిధంగా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు తీస్తూ రాష్ర్టానికే ఆదర్శంగా రూపుదిద్దుకుంటున్నది. మారుమూల పల్లెల నుంచి పట్టణం వరకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించి పరిష్కరిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 24న పలు ప్రారంభోత్సవాల కోసం సూర్యాపేటకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సముదాయ నిర్మాణం దాదాపు పూర్తి కాగా మెరుగులు దిద్దుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల నుంచి తమ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చి పోయే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు ఉండాలంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటికే ఉన్న పలు రోడ్లకు అదనంగా కొత్తగా బీబిగూడెం నుంచి కలెక్టరేట్ వరకు కొత్త రహదారిని నిర్మిస్తున్నారు.
రూ.12.10కోట్లతో కొత్త రహదారి
సూర్యాపేట కలెక్టరేట్‌కు ప్రస్తుతం మూడు రహదారులు ఉండగా కొత్తగా నాలుగో రహదారి రాబోతున్నది. కొత్త బస్టాండ్, ఖమ్మం క్రాస్ రోడ్డు మధ్య ఎక్స్టెన్షన్ 60ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టరేట్‌కు ప్రధాన రహదారి ఉండగా కుడకుడ నుంచి మరోటి అలాగే ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద మూసీ కాల్వ ద్వారా మరో రహదారి ఉంది. తాజాగా సూర్యాపేట-ఖమ్మం రహదారిలోని బీబీగూడెం నుంచి కలెక్టరేట్ వరకు 2.5కిలో మీటర్ల దూరం తారురోడ్డు నిర్మిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాడు రూ.12.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ రహదారి పూర్తయితే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలు సూర్యాపేట పట్టణంలోకి రాకుండానే కొత్త మార్కెట్ నుంచి ఖమ్మం రోడ్డుకు మంత్రి జగదీష్‌రెడ్డి వేయించిన డైవర్షన్ రోడ్డు మీదుగా నేరుగా కల్టెరేట్‌కు చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మోతె, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల మండలాలల ప్రజలు పట్టణంలోకి రాకుండానే కలెక్టరేట్‌కు చేరుకోవచ్చు.