– కోదాడలో యదేచ్చగా మున్సిపల్ స్థలం కబ్జా
– అనుమతులు లేకుండా మట్టి ఇసుక దందా
– చేతనైతే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్
కోదాడ, జూన్ 11 : కోదాడ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి జరుగుతుంటే నిలువరించలేక, ప్రశ్నించిన తమ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై అవాకులు చావాకులు పేలితే సహించేది లేదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. గురువారం కోదాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో యదేచ్చగా అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతుంటే, అక్రమ ఇసుక తరలిస్తుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకుండా తమ నాయకుడిని విమర్శించడం ఏంటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణంలో యాదవ నగర్లో బహిరంగంగా మున్సిపాలిటీ స్థలంలో ఓ కాంగ్రెస్ నాయకుడు భారీ డబ్బా కొట్టు ఏర్పాటు చేస్తే తొలగించాలని తాము మున్సిపల్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని అయినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదన్నారు.
మున్సిపాలిటీ సామగ్రిని అద్దె భవనాన్ని మార్చేందుకు రూ.25 లక్షలు కమిషనర్ బిల్లు పెడితే ఏం చేస్తున్నారన్నారు. ఇక ఔట్ సోర్సింగ్ లో ఇష్టం వచ్చినట్లుగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి సదరు అధికారి లక్షలు లంచం తీసుకుందని, లేని ఉద్యోగుల పేరు మీద జీతాలు డ్రా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పట్టణంలో పెట్రోల్ బంకు పక్కన 2,000 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆ విషయాన్ని తమ నాయకుడు ప్రశ్నించారన్నారు. ఇలా అధికారుల అవినీతిపై నిలదీస్తే వారిపై చర్యలు తీసుకోకుండా తమ నేతను విమర్శిస్తే సహించబోమన్నారు. చేతనైతే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు సంపేట ఉపేందర్ గౌడ్, కృష్ణయ్య, కరీం, లింగయ్య, చలిగంటి వెంకట్, గొర్రె రాజేష్, కిరణ్ రెడ్డి, చంద్రమోహన్ పాల్గొన్నారు.