నల్లగొండ, సెప్టెంబర్ 16: సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు జెండావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. వేడుకల్లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొననున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో జాతీయ జెండావిష్కరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 16 : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి సూర్యాపేట కలెక్టరేట్ ముస్తాబైంది. మంగళవారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ముఖ్యఅతిథిగా హాజరై 9.50 గంటలకు తెలంగాణ అమరులకు పుష్పాంజలి ఘటించనున్నారు. 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రసంగిస్తారు. 10.30 గంటలకు సంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటలకు వివిధ శాఖల స్టాల్స్ ప్రదర్శన ఉంటాయి. 11.30 గంటలకు కార్యక్రమం ముగింపు ఉండనున్నది. వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ పాల్గొననున్నారు.