పెన్పహాడ్, జులై 01 : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామంలో 370 మందిని ఇల్లులేని లేనివారిగా గుర్తించారు. ఇందులో నుండి మొదటి లిస్టులో 55 మంది లబ్ధిదారులను ఫైనల్ చేసి ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతారానికి చెందిన దళిత దంపతులైన మామిడి సరిత – లక్ష్మయ్య ఇల్లు పూర్తి శిథిలావస్థకు చేరిన ఇంట్లో నివసిస్తూ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు మంజూరు చేయించాలని కాంగ్రెస్ నాయకుల కాళ్లు పట్టుకున్నారు. రోజూవారి కూలి చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఇద్దరు కుమారులు. వీరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని మొదటి లిస్ట్ లో ఉన్నదని తెలిపారు. కాగా ఎన్నికల సమయంలో బి.ఆర్ ఎస్ పార్టీలో తిరగడంతో వచ్చిన ఇల్లును అధికార పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తిరస్కరించారు.
ఇల్లు వస్తుందని ఖాళీ జాగ కోసం ఉంటున్న పాత ఇంటిని కూలగొట్టి, పక్కనే ఉన్న మరొకరి ఇంటి స్థలంలో తాత్కాలికంగా టార్ఫాలిన్ కవర్లతో ఓ గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. ఖాళీ జాగా చూపిస్తే వచ్చి ముగ్గు పోస్తామని చెప్పిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు చివరికి లిస్టులో పేరులేదని చేతులెత్తేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మామిడి సరిత -లక్ష్మయ్య లబోదిబోమంటున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి సోమయ్యను వివరణ కోరగా గ్రామంలో 370 మంది ఎల్ -1 లిస్ట్ లో ఉండగా 55 మంది లబ్ధిదారులను గుర్తించామని మొదటి విడతలో పేరులేదని ఇందిరమ్మ కమిటీ వారు వారిని ఎంపిక చేయలేదని తెలిపారు.

అర్హులను అణగదొక్కి.. ఇందిరమ్మ ఇండ్లన్నీ అనుయాయులకే
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా పార్టీలకతీతంగా అర్హులందరికీ ఫలాలు అందేవి. బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం లేకుండానే డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు, రైతు బంధు లాంటి ఎన్నో పథకాలు అర్హులకు అందాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు ఆరుసార్లు సర్వేలు చేసి అర్హులను గుర్తించింది. అధికారులు వెల్లడించిన జాబితాలో పేర్లు ఉన్న పేదలు తమకు ఇండ్లు మంజూరయ్యాయని సంతోషంలో ఉండగానే ఇది ఫైనల్ కాదని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన జాబితానే ఫైనల్ అని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను కాకుండా వారికి అనుకూలంగా ఉన్నవారు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.