అర్వపల్లి, సెప్టెంబర్ 04 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్ అన్నారు. గురువారం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలానికి చేతితో, బ్యాటరీతో మందు కొట్టే పంపులు 181 మంజూరు కాగా జనరల్ 136, ఎస్సీ 29, ఎస్టీకి 16 కేటాయించామని, రూ.1,000 రాయితీ ఉందని తెలిపారు. తైవాన్ పవర్ స్ప్రేయర్లు 26 ఉండగా రాయితీ రూ.10 వేలు ఉందని, ఇందులో జనరల్ కు 20, ఎస్సీ- 4, ఎస్టీకి 2 కేటాయించినట్లు చెప్పారు. అలాగే రోటోవేటర్లు 8 ఉండగా రాయితీ రూ.50 వేలు ఉందని, జనరల్ 6, ఎస్సీ-1, ఎస్టీకి 1 కేటాయించామని, విత్తనాలు, ఎరువులు వేసే డ్రిల్ మిషన్లు 2 మంజూరు కాగా, రాయితీ రూ.30 వేలు ఉందని, జనరల్ 1, ఎస్సీ 1 కేటాయించినట్లు వెల్లడించారు.
అలాగే ట్రాక్టర్‌తో దున్నే కల్టివేటర్ డిస్కహరో, నాగలి, దమ్ము, చక్రాలు 12 మంజూరు కాగా, రాయితీ రూ.20 వేలు ఉందని, జనరల్ 9, ఎస్సీ 2, ఎస్టీ 1 కేటాయించామని, పొలంగట్టు వరాలు చెక్కే యంత్రం 1 మంజూరైందని, రాయితీ రూ.15 వేలు ఉండగా జనరల్ కేటాయించామన్నారు. కలుపుతీసే పవర్ వీడర్ 1 మంజూరు కాగా, రాయితీ రూ.35 వేలు ఉందని, ఎస్టీకి కేటాయించగా, బ్రష్ కట్టర్లు 2 మంజూరు కాగా రాయితీ రూ.35 వేలు, జనరల్ కు 1, ఎస్టీ 1 కేటాయించామని, ట్రాక్టర్ కు అమర్చే పవర్ టిల్లర్లు 1 మంజూరైందని, రూ.1 లక్ష రాయితీ తో జనరల్‌కు కేటాయించామని తెలిపారు.
ఈ వ్యవసాయ పనిముట్లు రాయితీలపై పొందుటకు రైతులు ఈ నెల 15వ తేదీ లోపులో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. దరఖాస్తుకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, పాస్ ఫొటోలు జతపరచాలని, ట్రాక్టర్‌కు సంబంధించిన పనిముట్లు పొందేవారు వ్యవసాయ ట్రాక్టర్ ఆర్సీ జిరాక్స్ జతపరచాలని తెలిపారు. వివరాలకు మండల వ్యవసాయ అధికారి సెల్ నెంబర్ 8977755373 ను సంప్రదించాలని పేర్కొన్నారు.