రామగిరి, మార్చి 27: పాఠశాలల ప్రారంభం నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముందుస్తుగానే పాఠ్యపుస్తకాలు సరఫరా చేయనుంది. నల్లగొండలోని కేంద్రానికి పుస్తకాల రాక ప్రారంభమైంది. గురువారం పుస్తకాలు ప్రత్యేక వాహనాల్లో వచ్చాయి.
ప్రభుత్వ పాఠ్యపుస్తక విభాగంతో పాటు ఫ్రభుత్వ బీఈడీ కళాశాలలో పుస్తకాలను భద్రపరిచారు. పాఠ్యప్తుకాలు పక్కదారి పట్టకుండా ప్రతి పుస్తకానికి బార్కోడ్ నమోదు చేయడంతో పాటు బహిరంగ మార్కెట్ల్లోకి వస్తే సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో 1,659 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,18,296 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. జిల్లాకు చేరిన పుస్తకాలను డీఈవో అనుమతితో మండలాలకు చేరవేస్తారు.
జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 137 టైటిల్స్‌తో 5 లక్షల 60 వేల 955 పాఠ్యపుస్తకాలు అవసరమున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఈసారి 37 టైటిల్స్‌తో ఇప్పటి వరకు 1,64,340 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో భద్రపరుస్తున్నారు. డీఈవో భిక్షపతి ఆదేశాల మేరకు జిల్లాలోని మండల వనరుల కేంద్రాలకు చేరవేయనున్నట్లు బుక్ డిపో మేనేజర్ వెంకటచారి వెల్లడించారు.