– రెండేళ్లు దాటినా లబ్ధిదారులకు అందని బిల్లు
– కొలతల తేడాతో ఆగిపోయిన ఇంటి నిర్మాణం
– అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం
దుమ్ముగూడెం, జూలై 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే ప్రారంభించారు. అదే సమయంలో దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు సున్నం లక్ష్మీకుమారి, బాడిస రామారావు భార్యకు సీఎం స్వయంగా ఇందిరమ్మ ఇంటి పట్టాలు అందజేశారు. మంజూరు పత్రాలు అందించి నేటికి రెండేళ్లు దాటినా లబ్ధిదారుల్లో లక్ష్మీకుమారికి బేస్మెంట్ లెవల్ వరకు వచ్చేసరికి కొలతల తేడాతో ఇంటి నిర్మాణానికి అందాల్సిన బిల్లులు అందక నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ ఇంటి నిర్మాణం బిల్లు కోసం… నిర్మాణం కొనసాగించేందుకు అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా లబ్ధిదారు తిరిగినప్పటికీ నేటికీ ఎలాంటి ఫలితం లేకుండానే పోయింది.
2024 మార్చి నెలలో సీఎం చేతుల మీదుగా లబ్ధిదారురాలు లక్ష్మీకుమారి ఇంటి మంజూరు పత్రం అందుకుంది. ఏప్రిల్ 18న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన ఇంటి నిర్మాణం చేసుకోవాలని… నవమి నాటికి ఇంటి బేస్మెంట్ పనులు పూర్తి కావాలని పదే పదే చెప్పడంతో లబ్ధిదారురాలు అప్పు చేసి మరీ బేస్మెంట్ పిల్లర్ల వరకు ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది. రెండు నెలలు సమయం గడిచాక ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొత్తగా యాప్ రావడంతో తప్పిదం అక్కడ మొదలైంది. యాప్‌లో ఇంటి నిర్మాణ కొలతలను కార్యదర్శితో పాటు ఏఈలు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత లబ్ధిదారురాలితో మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి కొలతలు తేడా ఉన్నాయని, బిల్లు వచ్చే అవకాశం లేదని చెప్పడంతో చేసేదేమి లేక లబ్ధిదారురాలు ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా నిలిపివేసింది. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమైనా సహాయం చేస్తారేమోనని వాళ్ల చుట్టూ రెండు సంవత్సరాలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా నేటికీ సొంతింటి కల కలగానే మిగిలింది.

సీఎం చేతుల మీదుగా ‘ఇందిరమ్మ’ ఇంటి పట్టా అందజేత.. అయినా
లబ్ధిదారురాలు లక్ష్మీకుమారి ఇంటి నిర్మాణమే రాకుండా మండలంలో సుమారు 10 మంది వరకు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలు ఈ కొలతల తేడాతోనే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కొత్తగా వచ్చిన ఇందిరమ్మ ఇంటి యాప్ కారణంగా ముందుగా అధికారులు చెప్పిన కొలతలు… ఇప్పుడు యాప్ ప్రకారం ఉన్న కొలతలు సరితూగకపోవడంతో లబ్ధిదారులకు సొంతింటి కల కలగానే మిగిలిందనే ఆరోపణలు బాధితుల నుంచి వినవస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి మండలానికి 1,487 ఇళ్లు మంజూరవ్వగా 1,483 మందికి కలెక్టర్ నుంచి ఇంటి నిర్మాణాలకు అనుమతి లభించిందని, మార్కింగ్‌లో ఉన్నవి 1,382 కాగా బేస్మెంట్ లెవల్ 1,291, రూప్ లెవల్ స్థాయిలో 774, స్లాబ్ దశకు చేరుకున్నది 412 ఇళ్లు ఉండగా 139 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని, 101 ఇళ్లు లబ్దిదారులు అసలు ఇంకా మొదలు పెట్టలేదని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

సీఎం చేతుల మీదుగా ‘ఇందిరమ్మ’ ఇంటి పట్టా అందజేత.. అయినా
సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి పట్ట అందుకున్న లబ్దిదారురాలు లక్ష్మీకుమారి ఇంటి కొలతల విషయంలో పొరపాట్లు జరిగాయి. కొత్తగా ఇందిరమ్మ ఇంటికి సంబంధించి యాప్ రావడంతో ఈ కొలతల్లో తేడా సంబంధిత అధికారులు గుర్తించారు. ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొలతలను మార్పు చేసి బిల్లు మంజూరు చేసేలా ఉన్నతాధికారులతో చర్చించి లబ్దిదారురాలికి న్యాయం చేస్తాం. అదేవిధంగా మండలంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పొరపాట్లు జరిగిన లబ్దిదారుల ఇళ్లకు బిల్లులు మంజూరు చేస్తాం.