సూర్యాపేట, జూన్ 02 : కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ పదం అంటేనే భయపడే రోజులు ఉండేవని ఆంధ్రా కుట్రదారులు, ఆంధ్రా దళారులు ఎన్నో పన్నాగాలు పన్నీ తెలంగాణను అడ్డుకున్నారన్నారు. అప్పుడు ధైర్యంగా ఉక్కు సంకల్పంతో తెలంగాణ కోసం ఒక్కడిగా సిద్ధిపేట నుండి బయల్దేరిన కేసీఆర్ ఆంధ్ర కుట్రలను అన్నిటిని చేర్చి గమ్యాన్ని ముద్దాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడన్నారు.
దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుని చట్టసభల ద్వారానే తెలంగాణ సాధ్యమని అలుపెరుగని పోరాటం చేసిన నేత కేసిఆర్ అన్నారు. పోరాడి తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అద్భుతమైన పాలన చేసి ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారన్నారు. 24 గంటల కరెంటును అందించి దేశంలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని వ్యవసాయం, పాలు, మాంసం ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో తెలంగాణను ఉంచారని గుర్తు చేశారు. ఇవాళ కెసిఆర్ ను దూరం చేసుకుని ప్రజలు దుఃఖిస్తున్నారని కేసిఆర్ దూరం కావడంతో అన్ని పథకాలు దూరమయ్యాయన్నారు. చక్కగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందని, ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మళ్లీ ఉద్యమ చైతన్యంతో మనం పోరాటం చేయాలని బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని లేదంటే తెలంగాణ పూర్తిగా అన్యాయానికి గురవుతుందన్నారు.
ఇప్పటికే మళ్లీ ఆంధ్రా ఉద్యోగులు, ఆంధ్రా కుట్రదారులు వస్తున్నారని ఇప్పుడు విద్యుత్ సంస్థలో ఆంధ్రా అధికారుల పాలన నడుస్తుందన్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని, మరొక తెలంగాణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. బిజెపితో చీకటి ఒప్పందం చేసుకున్న ఆంధ్రా ఏజెంట్ కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలని, కాంగ్రెస్ పాలన అంతం చేయాలనిర ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, నెమ్మది భిక్షం, గోపగాని వెంకట నారాయణ, జీడీ భిక్షం, మరిపెద్ది శ్రీనివాస్, పుట్ట కిశోర్, ఆకుల లవకుశ, భాషమీయ, మహిళా నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణలో ఆంధ్రా అధికారుల పాలన : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి